పార్టీలు మారుతున్నరు… పరపతి పోగొట్టుకుంటున్నరు..
-తరచూ పార్టీలు మారే నేతగా బోడ జనార్దన్ రికార్డు
-జంపింగ్ జపాంగ్ నేతగా పేరు పొందిన వివేక్ వెంకటస్వామి
-తమ్ముడిలాగే తప్పులు చేసి రాజకీయ భవిష్యత్ లేకుండా చేసుకుంటున్న గడ్డం వినోద్
-పార్టీలు మారి తనకున్న ఇమేజ్ను దెబ్బతీసుకుంటున్న నల్లాల ఓదెలు
నేతలు పార్టీలు మారడం కొత్తేమీ కాదు.. తప్పు అంతా కన్నా కాదు.. కానీ, తాము ఉన్న పార్టీలు తరచూ మారితే.. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీలోకి వెళతాడో తెలియని పరిస్థితుల్లో జనం అయోమయానికి గురైతే.. నేతలు పార్టీలు మారడంలో రికార్డులు సృష్టిస్తున్నారు. అదే సమయంలో వారి పట్ల జనాల్లో, తమ అనుచరవర్గంలో పలుచన అవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు వారిని పట్టించుకోవడం మానేస్తున్నారంటే నేతల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
గతంలో ఒక నేత ఒక పార్టీలో ఉంటే చనిపోయే వరకు అదే పార్టీలో కొనసాగేవారు. ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల కోసం పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తనకు ఎందులో నచ్చితే అందులోకి, ఎప్పుడు నచ్చితే అప్పుడు జంప్ చేయడమే నేతలకు అలవాటుగా మారింది. డబ్బుకు లోబడో, లేక తమకు ఇబ్బందులు అనిపించో, తాము అనుకున్న స్థానం దక్కకనో నేతలు పార్టీలు మారుతున్నారు. ఒకటికి రెండు సార్లు పార్టీలు మారుతుండటంతో జనంలో వారి పట్ల ఒక రకమైన భావన ప్రబలుతోంది. దీంతో ఎన్నికల్లో వారు గెలవడం మాట అటుంచి అటు పార్టీలు సైతం వారికి సరైన స్థానం కల్పించడం లేదు. అటు పార్టీలో స్థానం లేక, ఇటు ప్రజల్లో పలుకుబడి లేక నేతలు రెంటికి చెడ్డ రేవడిలా మారుతున్నారు.
బోడ జనార్దన్… ఈ పేరు వినగానే.. పత్రికల్లో మళ్లీ గోడ దూకిన బోడ అనే శీర్షిక ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. ఆయన మారినన్ని పార్టీలు ఈ మధ్య కాలంలో ఏ నేత కూడా మారలేదు. తరచూ పార్టీలు మారే నేతగా గుర్తింపు పొందిన ఆయన.. పార్టీలు మార్చడంలో ఒక రకంగా రికార్డు సాధించారు కూడా.. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో నాలుగు సార్లు శాసన సభ్యుడిగా, చంద్రబాబు హయంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన జనార్ధన్ తూర్పు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. బోడ జనార్ధన్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగానే వ్యవహరించి రాష్ట్ర నేతగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం బీజేపీలో పనిచేసి తర్వాత తిరిగి సొంతగూటికి చేరుకొని టిడిపి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (సీపీఎం కూటమి) నుంచి పోటీ చేశారు. తిరిగి బీజేపీలో చేరారు. బీజేపీలో తగిన ప్రాధాన్యత దొరకలేదు. ఇక లాభం లేదనుకుని తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరు టిక్కెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ టిక్కెట్టు రాకపోతే మళ్లీ పార్టీ మారుతారని జోకులు సైతం వేసుకుంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు’ అనేది జగమెరిగిన సత్యం. అతి విశ్వాసం, నిలకడ లేని నిర్ణయాలతో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ అదే పని చేస్తున్నారని అనిపిస్తుంది. వివేక్ వెంకటస్వామి… కాకా తనయుడిగా ఆయనకు ఎంతో పేరుంది. కానీ ఆయన పార్టీలు మారుతూ ప్రజల్లో పలుచన అవుతున్నారు. వివేక్ కాంగ్రెస్ తరఫున 2009లో పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన వివేక్ కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే, అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తరువాత సరిగ్గా 2014 ఎన్నికల ముందు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విద్యార్థి నాయకుడిగా పోటీ పడ్డ బాల్క సుమన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ తో సఖ్యతతో మెలిగిన ఆయన 2017లో సింగరేణి ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్ లో చేరారు. 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… అనే ఆలోచనతో టీఆర్ఎస్లోనే ఉంటూ పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారనేది ఆరోపణ. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలో ఉన్నా ఆయన తిరగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనేది జోరుగా ప్రచారం సాగుతోంది.
తరచూ పార్టీలు మారి రాజకీయ భవితవ్యం కోల్పోయిన వారిలో గడ్డం వినోద్ సైతం ఉంటారు. తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1999లో చెన్నూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2 జూన్ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన 2014లో చెన్నూరు అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2016లో టీఆర్ఎస్ లో చేరి 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించడంతో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి బిఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పోయారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈయన కూడా తమ్ముడిలాగే పార్టీలు మారుతూ రాజకీయంగా సరైన నిర్ణయాలు తీసుకోని నేతగా మిగిలిపోతున్నారు.
వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న నల్లాల ఓదెలు సైతం ఈ మధ్య కాలంలో పార్టీలు మారిన నేతగా ముద్ర వేసుకున్నారు. ఓదెలు టీఆర్ఎస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ పార్టీలో విప్ బాల్క సుమన్‌తో పొసగకపోవడంతో నల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీకి 2022 మే 19న రాజీనామా చేసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత ఆయన 2022 అక్టోబర్ 5న ప్రగతి భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరాడు. తిరిగి 2023 సెప్టెంబర్ 15న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదటి సారి కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్లో చేరిన క్రమంలో ఆర్థికంగా లాభం కూడా చేకూరిందన్న ప్రచారం సైతం జరిగింది. ఆయన ఇలా రెండు సార్లు పార్టీ మారడం వెనక ఆంతర్యం ఏమిటన్నది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. ఆయన తనకున్న ఇమేజ్ను దెబ్బతీసుకున్నారని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు.