రాజయ్య రాజీ..
Station Ghanpur Constituency: స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎట్టకేలకు కడియం శ్రీహరితో రాజీ కుదుర్చుకున్నారు. ఈ రోజు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు కృషిచేస్తానని చెప్పారు. తనకు మద్దతు ప్రకటించడం పట్ల రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్ సైతం రాజయ్యకు సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
స్టేషన్‌ఘన్‌పూర్ అంటేనే గులాబీలో లొల్లి అనే పదంగా మార్చారు. కడియం శ్రీహరి, రాజయ్య. ఒకరిపై ఒకరి ఆధిపత్య పోరు, టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. దళిత బంధు పథకంపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు ఇప్పటికే అనేకసార్లు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పంచాయితీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. స్టేషన్ ఘనపూర్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు తన్నుకుంటున్న తీరు అక్కడ వారిని విస్మయానికి గురిచేసింది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల నేతలు బలంగా లేకపోవడంతో సొంత పార్టీల నేతలే బలంగా తన్నుకుంటున్న పరిస్థితి ఉందని చర్చ సైతం సాగింది. పోటాపోటీగా వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వర్గాలు నియోజకవర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయడం మరోమారు చర్చనీయాంశంగా మారింది.
దీంతో మంత్రి కేటీఆర్ సమక్షంలో వీరిద్దిరి కూర్చోబెట్టి మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తమకు రాజీ కుదిరిందనే సంకేతాలు కార్యకర్తలకు పంపించారు. కానీ, గతంలో సైతం ఇదే విధంగా రాజీ కుదిరి మళ్లీ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుని రోడ్డుకెక్కారు. మరి ఈసారి కూడా అలాగే జరుగుతుందా..? లేక నిజంగానే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరికి మద్దతు ఇస్తారా..? అన్నది వేచి చూడాలి మరి..