రావోయి.. రథసారథి..

KTR: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో కేటీఆర్ పర్యటిస్తారు. అనంతరం ఆయన పెద్దపల్లి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.
మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి మందమర్రికి వస్తారు. మధ్యాహ్నం 12 గంటల వరకు మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలలో 250 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మందమర్రి మున్సిపాలిటీలో 500 కోట్ల రూపాయలతో మందమర్రి మండలం శంకరపల్లి వద్ద నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీ భూమి పూజ చేస్తారు. 40 కోట్ల రూపాయలతో మందమర్రిలో 13 వేల గృహాలకు తాగునీరందించేందుకు మిషన్ భగీరధ (అర్బన్) ప్రారంభోత్సవం చేస్తారు. రూ. 29.68 కోట్ల తో మందమర్రి పట్టణంలో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ. 25 కోట్ల ప్రత్యేక నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. మున్సిపల్ శాఖ నుండి మంజూరైన రూ. 20కోట్లతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు భూమి పూజ, రామకృష్ణాపూర్ – మందమర్రి పట్టణాల మధ్యలో కాళీ నగర్ వద్ద రూ. 8కోట్లతో పాలవాగుపై నిర్మించే వంతెనకు భూమి పూజ, రూ. 3.30 కోట్లతో మందమర్రిలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం చేస్తారు. రూ.2కోట్లతో మందమర్రి పట్టణంలో నిర్మించిన సమ్మక్క – సారలమ్మ మహిళా భవన్ ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ. 1 కోటితో నిర్మించిన “కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనం” ప్రారంభోత్సవం, 1.54 కోట్ల రూపాయలతో నిర్మించే 2 చెక్ డ్యామ్స్ కు శంకుస్థాపన, 5 లక్షల రూపాయలతో నిర్మించిన బతుకమ్మ మైదానం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మందమర్రిలో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.40 కోట్ల డి.ఎం.ఎఫ్.టి. నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. రూ.15.16 కోట్లతో రామకృష్ణాపూర్లో నిర్మించిన 286 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.50 కోట్లతో గాంధారి వనం వద్ద 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ అర్బన్ పార్క్ పనులకు భూమి పూజ, రామకృష్ణాపూర్ లో సింగరేణి ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం నిర్వహించనున్న సభలో పాల్గొంటారు.
అనంతరం మంత్రి పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ఐటీ పార్క్, అంతర్గాంలో నిర్మించనున్న ఇండస్ట్రియల్ పార్క్, 100 కోట్ల పైలాన్‌తోపాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే ‘రామగుండం దశాబ్ధి ప్రగతి సభ’లో పాల్గొని ప్రసంగించనున్నారు. అంతర్గాం మండలం పెద్దంపేట, రాయదండి గ్రామాల్లో ఖురూజ్‌కమ్మీ భూములకు సంబంధించి మొదటి విడతగా 600 మందికి భూమి హక్కులు కల్పించనున్నారు. 58, 59,76 జీవోల ద్వారా రామగుండంలోని లబ్ధిదారులకు పట్టాలు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్, 3425 మందికి 4 వేల చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత పెద్దపల్లికి చేరుకుని, మున్సిపల్ పరిధిలో రూ. 25 కోట్ల టీఎఫ్‌ఐడీసీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల పనులకు శంకుస్థాపన చేస్తారు.