ఆత్మరక్షణలో అధికారపార్టీ
-అభివృద్ధి పక్కన పెడితే సమస్యలే అధికం
-మాతా శిశు సంరక్షణా కేంద్రం స్థలం విషయంలో పూర్తి వ్యతిరేకత
-గూడెం ఎత్తిపోతల పథకం లీకేజీలతో రైతుల్లో ఆగ్రహం
-వరదలతో మునుగుతున్న మంచిర్యాల పట్టణం
-కాంగ్రెస్ చేతికి అస్త్రాలు అందించిన బీఆర్ఎస్
-గట్టేక్కాలంటే సింగరేణి ప్రాంత ఓట్లే కీలకం
-నాందిన్యూస్ నియోజకవర్గ విశ్లేషణ - 1

Mancharya Constituency: సాధారణంగానే అధికార పార్టీకి వ్యతిరేకత ఉంటుంది… అది మంచిర్యాల నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ స్వయంకృతాపరాధమనే చెప్పాలి. తనకు ప్రతీ ఎన్నికల్లో అండగా నిలబడిన పట్టణ ఓట్లను సైతం ఆయన దూరం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంచిర్యాల పట్టణంలో ఈసారి ఆయనకు పూర్తిగా వ్యతిరేకం కానున్నాయని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం పట్టణానికి దూరంగా నిర్మించడం, గూడెం ఎత్తిపోతల పథకం నిత్యం లీకేజీలు, వరదలు ముంచెత్తి మంచిర్యాల పట్టణాన్ని ముంచివేయడం ఇలా ఎన్నో కారణాలతో ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీకి గడ్డుకాలం దాపురించింది. కాంగ్రెస్ పార్టీ దీనిని చాలా చక్కగా వాడుకుంటోంది.
మంచిర్యాల నియోజకవర్గంలో మొదటి నుంచి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా కొనసాగుతుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు కాంగ్రెస్ తరఫున అధికార పార్టీని ఎదుర్కొని ధీటుగా నిలబడతారు. అయితే, రెండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేకపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సైతం ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తు చేస్తోంది. అయితే, అధికార పార్టీ చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారాయి. సాధారణంగా అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకతో పాటు ఈ తప్పులు కాస్తా బీఆర్ఎస్ పుట్టి ముంచనున్నాయి. మరీ ముఖ్యంగా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మంచిర్యాల పట్టణ ఓట్లు దూరం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మంచిర్యాల పట్టణంలో నిర్మించిన మాతా శిశు సంరక్షణా కేంద్రం ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చపోగా, ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలకు కారణమైంది. వాస్తవానికి మంచిర్యాల పట్టణంలోనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా స్థలం ఉంది. ప్రజలకు దానిని మార్కెట్‌కు కేటాయించి ఇక్కడ నిర్మించాల్సిన మాతా శిశు సంరక్షణా కేంద్రం గోదావరి ఒడ్డున భూదాన్ భూముల్లో కట్టారు. దీంతో గోదావరికి వరద వచ్చినప్పుడల్లా అందులో ఉండే గర్భిణీలు, బాలింతలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సి వస్తోంది. వరదల బారి నుంచి కాపాడేందుకు గత ఏడాది రక్తమోడుతున్నా ఆపరేషన్లు అయిన బాలింతలను తరలించాల్సి వచ్చింది. పైగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు అక్కడకు వెళ్లాలంటే ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చి వెళ్లాల్సి వస్తోంది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారపార్టీని దుమ్మెత్తి పోసింది. ప్రజలకు అనుకూలంగా ఉండే ఐబీ ఏరియా కాదని దూరంగా మాతా శిశు సంరక్షణా కేంద్రం నిర్మించడానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని దుయ్యబట్టారు. అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే మార్కెట్ కూల్చివేసి అక్కడే మాతా శిశు సంరక్షణా కేంద్రం నిర్మిస్తామని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. అది కాస్తా ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఇక గత ఏడాది వరదల్లో మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఆ సందర్బంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు కావాల్సినంత వేగంగా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులను పరుగులు పెట్టించి, వారితో పనిచేయాల్సినంతగా పనిచేయించలేదు. ఆయన కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించినా బాధితులకు సౌకర్యాలు కల్పించడలంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.
ఇక దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరిపై నిర్మించిన శ్రీసత్యనారాయణస్వామి లిఫ్ట్ ఇరిగేషన్లో నాసిరకం పైపుల కారణంగా తరుచూ పంటలు ఎండిపోతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సంబంధిత కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయి నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంతోనే లిఫ్ట్ తరుచుగా మొరాయిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైపులైన్ నిర్మాణంలో కాసులకు కక్కుర్తి పడటం రైతులకు శాపంగా మారింది. కేవలం రూ.4 కోట్లు మిగు లుతాయనే ఉద్దేశ్యంతో ప్రణాళికను మార్చి చేపట్టిన పనుల కారణంగా తరుచుగా మరమ్మతులకు గురవుతోంది. ఫలితంగా యేటా యాసంగిలో నీరందక పంటలు ఎండిపోవడం షరా మామూలైంది. ఇది అధికార పార్టీపై రైతుల వ్యతిరేకతకు కారణం అవుతోంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ ఈ వ్యతిరేకతను ఎంత మేరకు అనుకూలంగా మార్చుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు ఇక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా ఆయన ప్రవర్తన పార్టీ శ్రేణులకు ఇబ్బంది కలిగిస్తోంది. చాలా మంది నేతలను ఆయన దూరం పెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చే ఆలోచన చేశారు. ఆయన రావడం ప్రేంసాగర్ రావుకు రావడం సుతారం ఇష్టం లేదు. ఇక వేళ ఆయన పార్టీలోకి వస్తే ప్రేంసాగర్ రావు గెలుపు ఖాయమైనట్లే. కానీ, తన గెలుపు అరవిందరెడ్డి వల్ల అనేది ప్రేంసాగర్ రావు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయనను దూరం పెడుతున్నారు. ఇలాంటి కారణాల వల్లనే మాజీ ఎమ్మెల్సీ ఓటమిపాలవుతున్నారు. ఈసారి మాత్రం అధికార పార్టీ వ్యతిరేకత ఆయనకు విజయం సాధించి పెడుతుందా..? లేదా..? అనేది వేచి చూడాలి.
ఇక, భారతీయ జనతా పార్టీ నుంచి పోటీలో ఉన్న వెరబెల్లి రఘునాథ్‌రావు సైతం కష్టపడుతున్నారు. ఆయన సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం, వెరబెల్లి ట్రస్టు ద్వారా ప్జలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పార్టీలోని సీనియర్లు అలక వహించడంతో పార్టీ పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్లడం లేదు. ఆ పార్టీ గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. ఈసారి కూడా అలాగే మూడో స్థానంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తపనతో అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా గెలవాలనే తపనతో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఇటు మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. వారిద్దరికీ దాదాపు ఇవే చివరి ఎన్నికలు కావచ్చు కూడా.. ఈ నేపథ్యంలోనే వారు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అధికార పార్టీకి ఉన్న వ్యతిరేకతతో ఆ పార్టీ ఓడిపోతుందా..? ఆ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయా..? లేక గతంలో ఓడించామనే సానుభూతితో ప్రజలు ఈసారి ప్రేంసాగర్ రావును గెలిపిస్తారా..? ఆయన ప్రవర్తన విషయంలో ఉన్న అసంతృప్తితో మళ్లీ ఓడిస్తారా..? కొద్ది రోజుల్లో తేలనుంది.