సింగరేణి ఉద్యోగులకు 16న లాభాల వాటా

Singareni:సింగరేణి కార్మికులకు ఈ నెల 16న లాభాల వాటా చెల్లించనున్నారు. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ (పా) ఈరోజు సర్క్యులర్ విడుదల చేశారు. అందులో ఏయే కార్మికులకు ఏ విధంగా చెల్లించాలనే ఆంశాలను పేర్కొన్నారు. 2022 -2023 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ. 2,222 కోట్ల లాభాలలో 32 శాతం అంటే రూ. 711.18 కోట్లను సింగరేణి కార్మికులకు చెల్లించనున్నారు.ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా అండర్ గ్రౌండ్ కార్మికులకు రోజుకు రూ. 662.74 ఓపెన్ కాస్ట్ కార్మికులకు రూ. 524.66 సర్ఫేస్ కార్మికులకు రూ. 484.31 చెల్లించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 మాస్టర్ల పైన డ్యూటీలు చేసిన వారు ఈ లాభాల వాటాకు అర్హులు అవుతారు. ఇందులో సుమారు రూ.7.11 కోట్లను వేర్వేరుగా రోజు వారి మస్టర్ ప్రాతిపదికన చెల్లించనున్నారు. ప్రోత్సాహక బహుమతి పొందిన వారికి ఒక పర్సెంట్ అంటే ఈ రూ.7.11 కోట్లు గ్రూప్ ఇన్సింటివ్ ప్రకారం చెల్లించనున్నారు.
కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు : మల్రాజు శ్రీనివాస్
ముఖ్యమంత్రి కేసీఆర్కు సింగరేణి అంటే ఎంతో ప్రేమ ఉందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ తెలిపారు. కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఆర్థికంగా లాభ పడేందుకు ఆయన ఆలోచిస్తారని స్పష్టం చేశారు. కార్మికులకు ఉపయోగపడేలా లాభాల వాటా పెంచినందుకు ముఖ్యమంత్రికి, దీనికి కృషి చేసిన సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులకి టీబీజీకేఎస్నాయకత్వానికి బెల్లంపల్లి ఏరియా టీబీజీకేస్, సింగరేణి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.