సింగరేణి ఎన్నికలు వాయిదా
Singareni:అనుకున్నట్టే అయ్యింది. సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించడానికి యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ తేదీ 11-10-2023 వరకు స్తంభింప చేయాలని ( Election process Siezed) అని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ఎల్సీ ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా వేయనుంది. ఈ మేరకు అధికార ప్రకటన రావాల్సి ఉంది.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాలు ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందటే నిర్వహించాల్సిన ఎన్నికలను యాజమాన్యం వెనక్కి జరుపుతూ వస్తోంది. ప్రభుత్వం ఎన్నికలకు భయపడి యాజమాన్యం, అధికారుల ద్వారా జరగకుండా చూస్తోందనే అపవాదు సైతం ఉంది. ఈసారి ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాల్సిన కార్మిక సంఘం పట్టుబట్టింది. అక్టోబరు 28న ఎన్నికలు నిర్వహించాలని ఆర్ఎఫ్సీఎల్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్షణం నుంచే సింగరేణి కార్మిక సంఘాలు స్వరం మార్చాయి. ఎన్నికలు నిర్వహించాలని సీఎల్సీ, ఆర్ఎల్సీ మీద పోరాటాలు, ఒత్తిడి చేసి రాతపూర్వకంగా ఎన్నికలు నిర్వహించాలని కోరిన సంఘాలు ఎన్నికలు ఇప్పుడు అవసరం లేదని మాట మార్చాయి.
2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల అనంతరం 2023వరకు కూడా నిర్వహించలేదు. ఏఐటీయూసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టుకు వెళ్లింది. మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహిచాలని, అక్టోబరు చివరి వరకు ఆర్ఎల్సీకి హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించే వరకు టీబీజీకేఎస్‌ను గుర్తింపు సంఘంగా పరిగణించరాదని, అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదాను కల్పించాలని డిమాండ్ చేశాయి. యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఆర్ఎల్సీ సమక్షంలో రాతపూర్వకంగా అంగీకారం తెలిపింది. దీంతో కార్మిక సంఘాలన్నీంటికి కూడా సింగరేణిలో సంప్రదింపుల అవకాశం, గౌరవం దక్కింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఒకటి రెండు సంఘాలు మినహా సింగరేణిలోని సుమారు పది సంఘాలకు ప్రాతినిధ్య, గుర్తింపు అవకాశాలు రావు. దీంతో ఎన్నికల వాయిదాను కార్మిక సంఘాలు సమర్థిస్తున్నాయి.