కాంగ్రెస్ గెలిస్తే మతకలహాలు
-కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు
-దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది
-మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే
-బీజేపీ డిపాజిట్ల గల్లంతు కమిటీ వేసుకోవాలి
-మంత్రి తన్నీరు హరీష్‌రావు
Minister Tanniru Harish Rao: కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో మత కలహాలు తప్ప అభివృద్ధి ఏ మాత్రం ఉండదని మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. మంచిర్యాల, చెన్నూరులో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అప్పుడు జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాదులో కర్ఫ్యూలు, మతకలహాలు జరిగాయని,ఆ పార్టీది భస్మాసుర హస్తమని, దానిని నమ్మితే మోసపోతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు నడవవని హరీష్‌రావు వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి డిపాజిట్లు కూడా దక్కవన్నారు, వచ్చే ఎన్నికల్లో కర్నాటక నుండి డబ్బులు వస్తాయట అని అన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ రాష్టంలో మారని పార్టీ లేదు, అటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతారా..? అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు క్రికెట్ వరల్డ్ కప్ నడస్తున్న దృష్ట్యా.. క్రికెట్ భాషలో చెప్పాలంటే.. రాష్ట్రంలో ఎన్నికలు ఏ రోజు జరిగినా బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ ఖాయమని, కేసీఆర్ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు లేని రన్ కోసం ఉరికి రనౌట్ అయితే, బీజేపీ వాళ్లు ఇప్పుడున్న ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవక డకౌట్ అవుతారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా 100 సీట్లతో కేసీఆర్ సెంచరీ కొడతారని ధీమా వ్యక్తంచేశారు. సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీని గెలిపించుకోని జేపీ నడ్డా.. తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని మంత్రి మండిపడ్డారు. ‘జేపీ నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా అని గుర్తుపెట్టుకో’ అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జీజేపీ ఒక్క చోటే గెలిచిందని, ఈ సారి ఆ ఒక్కటి కూడా రాదని అన్నారు. ఏవేవో కమిటీలు వేస్తున్న నడ్డా.. డిపాజిట్ దక్కించుకొనే కమిటీ వేసుకో అని చురకలంటించారు. నడ్డా వేసిన చేరికల కమిటీ అట్టర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేవారు. ‘బీజేపీ నుంచి బీఎల్ సంతోష్ అనే ఆయన వచ్చి ఈ రాష్ట్రంలో హంగ్ వస్తది అంటుండు. మిస్టర్ సంతోష్.. ఈ రాష్ట్రంలో హంగ్ కాదు.. బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడ్తది’ అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.