మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఊరట
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు (Minister Srinivas Goud) హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎన్నికకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం (High Court) కొట్టివేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 219లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2019 ఎన్నికల్లో అఫిడవిట్ ట్యాంపరింగ్ చేసారని ఆయన ఎమ్మెల్యేగా కొనసాగేందుకు అనర్హుడు అంటూ నాలుగేళ్ల క్రితం పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని అన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
విచారణలో భాగంగా హైకోర్టు ఓ అడ్వకేట్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్ కమిషన్ నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలను ధర్మాసనం విన్నది. తాజాగా పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీనివాస్ గౌడ్‌కు భారీ ఊరట లభించింది.