డబ్బులతో పట్టుబడ్డ వివేక్ కంపెనీ ఉద్యోగులు

ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసేందుకు తరలిస్తున్న డబ్బులను పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్, వెలుగు పత్రిక ఉద్యోగి ఇద్దరూ కలిసి రూ.50 లక్షలు తరలిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు ఉప్పల్ లో తనిఖీలు చేపడుతుండగా, ది్వచక్ర వాహనంపై (టీఎస్ 07 జేబీ 8681) ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేశారు. వారి బ్యాగులో రూ. 50 లక్షలు దొరకడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ డబ్బులను విశాఖ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు తరలిస్తున్నట్లు ఇద్దరూ అంగీకరించారు. విశాఖ ఇండస్ట్రీస్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ కంజుల రవికిషోర్, వెలుగు పత్రిక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న ముదిగంటి ప్రేంకుమార్ ఈ డబ్బులను చెన్నూరుకు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారి దగ్గర నుంచి రూ. 50 లక్షల రూపాయల నగదు, రెండు మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.