ఈ నేత… ఆ నేతను గెలిపిస్తాడా..?

Bellampalli: ఎంపీ వెంకటేష్ నేతపై పెద్ద భారమే పడింది. ఈ ఎన్నికల్లో అధినేత కేసీఆర్ ఆయనకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను గెలిపించే బాధ్యత అప్పగించారు. కానీ, అన్ని వర్గాలు దూరమై.. గెలుపు కష్టమైన తరుణంలో చిన్నయ్యను వెంకటేష్ నేత గెలిపించగలరా..? ఎమ్మెల్యే తీరు తనకు అంతుపట్టడం లేదని వెంకటేష్ నేత ఎందుకు వాపోతున్నారు..? ఏం చేయాలో అర్ధం కావడం లేదని ఆయన తల పట్టుకుంటున్నారా..? అయినా సరే, చిన్నయ్యను గెలిపించి తీరుతామని చెబుతున్న వెంకటేష్ నేత వ్యూహమేంటి…?
పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఈయనకు ప్రజలతో పెద్దగా పరిచయాలు ఉండవు… ఆయన ప్రజల్లో కనపించరు కూడా.. 2018లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున చెన్నూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ టిక్కెట్టు ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అయితే, ఆయన ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నియోజవర్గంలో కనిపించిదీ లేదు… అదే సమయంలో ప్రజల కోసం, వారి సమస్యల కోసం పాటు పడింది లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన కనబడటం లేదని ప్రతిపక్షాలు సైతం పలుమార్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. అయినప్పటికీ వెంకటేష్ నేత తీరు మారలేదనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక, ఆయన ఈ ఎన్నికల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గెలిపించే గురుతర బాధ్యత నెత్తిన పడింది.
అయితే, బెల్లంపల్లిలో ఇప్పటికే రాజకీయంగా బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి విజయం అంచుల వరకు వచ్చిన గడ్డం వినోద్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అసలే కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీపై వాస్తవంగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు బెల్లంపల్లి నియోజకవర్గంలో చిన్నయ్యపై చాలా వ్యతిరేకత ఉంది. ఇక తమ సొంత సామాజికవర్గమైన నేతకాని కులస్తులు పూర్తిగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ వెంకటేష్ నేత అన్ని వర్గాలు సమన్వయం చేసే ప్రయత్నం చేసినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కొందరు నేతలు కలిసి వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయి. దీంతో ఏం చేయాలో అర్దం కావడం లేదని ఎంపీ వెంకటేష్ నేత కొందరు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే వ్యవహార శైలి సైతం తనకు అంతుపట్టడం లేదని వెంకటేష్ నేత తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో సైతం దుర్గం చిన్నయ్య ఓటమి అంచుల వరకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేత వేణుగోపాల్ చారి ఓటమి నుంచి బయటపడేశారు. ఆయన బెల్లంపల్లిలో కలియదిరుగుతూ తనకు తెలిసిన నేతలు, పాత పరిచయాల ద్వారా అందరినీ పిలిపించుకుని మాట్లాడారు. వేణుగోపాలాచారి చెప్పడంతో చాలా మంది నేతలు తిరిగి బీఆర్ఎస్ వైపు నిలబడటంతో చిన్నయ్య గెలుపు సుగమమం అయ్యింది. కానీ, ఈసారి పరిస్థితి మాత్రం చేయిదాటిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. వెంకటేష్ నేతకు ఇక్కడ ఒక్క తన సామాజిక వర్గం మినహా వేరే పరిచయాలు ఏం లేవు. మరి చిన్నయ్య గెలుపు కోసం ఆయన ఏం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఏది ఏమైనా తాను చిన్నయ్యను గెలిపించి తీరుతానని ఎంపీ వెంకటేష్ నేత కంకణం కట్టుకున్నారు. తన వ్యూహాలు తనకున్నాయని ఆయన చెబుతున్నారు. మరి ఆయన వ్యూహాలు ఫలించి చిన్నయ్య బయటపడతారా..? ఎంపీ వెంకటేష్ నేత వ్యూహాలు ఫలిస్తాయా లేదా…? అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది