తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు

తెలంగాణ వ్యాప్తంగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎనిమిది చోట్ల సోదాలు కొనసాగుతుండగా, మరికొన్ని జిల్లాల్లో సైతం ఐటీ దాడులు సాగుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత వివేక్ ఇంటితో పాటు, తాండూరు మండలంలోని రేపల్లెవాడ మహేశ్వరి జిన్నింగ్ మిల్లులో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ నేత కాసం శ్రీనివాస్, ఆసిఫాబాద్ రఫీక్ అనే వ్యాపారి ఇంట్లో సైతం సోదాలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో బ్యాంకుల నుండి అధిక లావాదేవీలు జరుపుతున్న కాటన్ జిన్నింగ్ మిల్లులపై ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలోని సిరి కాటన్ జిన్నింగ్ మిల్లులో ఐటీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఉదయం నుండి సోదాలు కొనసాగుతుండగా, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది.