ఎన్నికల్లో అలజడులకు బీఆర్ఎస్ కుట్ర
-నన్ను ఓడిచేందుకు నీచమైన పనులు చేస్తున్నారు
-ఎన్నికల్లో ఓడిపోతామని నైతిక విలువలకు తిలోదకాలు
-విజిత్ అసభ్యకరమైన ఆడియో నా దగ్గర ఉంది
-ఒంటరిగా ఓడించలేక బీజేపీతో మిలాఖత్ అయ్యారు
-ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నా
-విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేంసాగర్ రావు

Prem Sagar Rao: ఎన్నికల్లో మంచిర్యాల ప్రాంతంలో అలజడులు, శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు కుట్రపన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ లోని కాప్రాలో భూ వివాదం కోర్టులో కొనసాగుతోందన్నారు. కోర్టులో ఓడిపోయిన, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను మంచిర్యాల తీసుకువచ్చి ఆత్మహత్య యత్నం చేసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెళ్లి ఎన్నికల్లో ఓడించాలనే నీచమైన కుట్రకు తెరతీసారని ధ్వజమెత్తారు. కోర్టు పరిధిలో ఉన్న కేసులపై బహిరంగంగా చర్చించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. బీఆర్ఎస్ కుట్రల గురించి ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల అధికారికి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. మంచిర్యాలలో శాంతిభద్రతల కు భంగం వాటిల్లితే అందుకు దివాకర్ రావు బాధ్యత వహించాలని హెచ్చరించారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నైతిక విలువలకు తిలోదకాలివ్వడం శోచనీయమని ఆయన అన్నారు. దివాకర్ రావు చరిత్రను బయటపెట్టడం పెద్ద సమస్య కాదని, కానీ రాజకీయాలలో కొన్ని హద్దులు ఉంటాయన్నారు. ఆయన కుమారుడు విజిత్ అసభ్యకరమైన ఆడియో ఉందని కానీ ఆయన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగవద్దనే ఉద్దేశ్యంతో బయటపెట్టలేదని తెలిపారు. అక్రమంగా సంపాదించిన డబ్బు విచ్చలవిడిగా పంచి పెట్టి అక్రమమార్గంలో ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. తనను ఒంటరిగా ఓడించలేక బీజేపీ తో మిలాఖత్ అయ్యారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉన్నానని గుర్తు చేశారు. అందుకే ప్రజలు తనను ఆదరిస్తు ఎమ్మెల్యేగా చూడాలని తహతహలాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్లు డబ్బులిస్తానని చెప్పినా ప్రజలు సమావేశాలకు వెళ్లడం లేదన్నారు.