తెలుగులో అదరగొట్టిన యోగీ
Yogi: కొమురం భీమ్ ఆసిఫాబాద్లో శనివారం నిర్వహించిన బీజేపీ సంకల్ప సభలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దాస్ పలు సందర్భాల్లో తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆయన పలు చోట్ల తన ప్రసంగాన్ని తెలుగులో మాట్లాడటంతో సభలో ఉన్న వారంతా హర్షధ్వానాలు చేశారు. భారత్ మాతాకీ జై.. జై శ్రీరాం.. నినాదాలతో ప్రారంభించిన ఆయన జై తెలంగాణ అంటూ చేసిన నినాదంతో సభికులు పెద్ద ఎత్తున జై తెలంగాణ అంటూ గొంతు కలిపారు. సోదర.. సోదరీమణుల్లారా.. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మీ ఓటు కమలం గుర్తుకే వేయాలని కోరుతున్నాను.. బీజేపీ రావాలి.. బంగారు తెలంగాణ స్వప్నం సాకారం కావాలంటూ ఆయన తెలుగులో కోరారు. బీజేపీని గెలిపిస్తం.. నవ తెలంగాణ నిర్మిస్తాం అని చెప్పాలన్నారు. మీ ఓటు కమలం గుర్తుకే వేయాలని కోరుతున్నాను అని కోరారు. తన ప్రసంగం మధ్య మధ్యలో తెలుగులో చేసిన ప్రసంగంతో సభికులు పెద్ద పెట్టున సంతోషం వ్యక్తం చేశారు.