రామగుండంలో భారీగా నగదు స్వాధీనం

పెద్దపల్లి జిల్లా రామగుండంలో భారీగా నగదు పట్టుపడింది. సోమవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ పట్టణంలో కృష్ణానగర్‌లో ఓ ఇంట్లో ఉంచిన రూ. 2.18 కోట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. సీ విజిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు కృష్ణానగర్‌లోని ఓ ఇంటిలో తనిఖీలు నిర్వహించి భారీగా నగదు పట్టుకున్నారు. పట్టుబడిన నగదు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చెందిన నగదుగా భావిస్తున్నారు. ఆదివారం రాత్రి బీ పవర్ హౌస్ వద్ద రూ. 50 లక్షలు పట్టుబడింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అదికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న వందల కోట్ల రూపాయలతోపాటు భారీగా బంగారు, వెండి నగలు పట్టుబడ్డాయి.