మీరు ఓట్లేసి గెలిపించకపోతే..
ఎన్నికల ప్రచారం చివరి రోజున అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగింది. చివరి రోజు కావడంతో అంతా పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. అయితే కొందరు అభ్యర్థులు చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. ఇందులో జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగే శ్రావణి, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోతే తనను బతకనివ్వరని బోగే శ్రావణి ఆవేదన వ్యక్తం చేయగా, తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్య చేసుకుంటానని పాడి కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓడిపోతే బతకనివ్వరు…
తాను ఈ ఎన్నికల్లో ఓడిపోతే బతకనివ్వరని, అసలు ఇక్కడ ఉండనివ్వరని జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగే శ్రావణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓట్లను ఓడిబియ్యం రూపంలో అందించి మీ ఆడబిడ్డను సంతోషంగా పంపిస్తారా..? ఓటేసి గెలిపిస్తారా..? అని ప్రశ్నించారు. అదే సమయంలో, ఇప్పుడు ఏదైనా అయితే గనుక బతికే పరిస్థితి ఉండదు.. ఇక్కడ ఉండనివ్వరు.. బతకనివ్వరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిచాచి ఓట్లను ఓడిబియ్యం రూపంలో అడుకుంటున్నా.. ఓడిబియ్యం ఇచ్చి మీ ఆడబిడ్డను ఆదుకుంటారా..? సంపుకుంటారా..? మీ ఇష్టం అంటూ అభ్యర్థించారు. తనను గెలిపిస్తే సిద్ధిపేట, సిరిసిల్లకు ధీటుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు.
నన్ను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య..
తనను ఈ ఎన్నికల్లో గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి వెల్లడించారు. కమలాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించకపోతే సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని తెలిపారు. మీరు ఓటేసి దీవిస్తే 4వ తేదీ నా జైత్రయాత్ర.. గెలిపించకుంటే మా కుటుంబ సభ్యుల శవయాత్ర అని అన్నారు. మా కుటుంబ సభ్యులు ముగ్గురం ఆత్మహత్య చేసుకుంటామని భార్య, కూతురు ముందే కౌశిక్ వ్యాఖ్యానించడం గమనార్హం.