పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు సిద్ధం
సాధారణ ఎన్నికల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు బిశ్వజిత్ దత్తా, పోలీసు పరిశీలకులు ఆర్.ఇలంగో, రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి, డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డితో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బాదావత్ సంతోష్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో 289 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 727 బ్యాలెట్ యూనిట్లు, 365 కంట్రోల్ యూనిట్లు, 411 వీవీ ప్యాట్లు కేటాయించామన్నారు. అదనపు సిబ్బందితో కలిపి 1567 మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఈవీఏం ర్యాండమైజేషన్ ద్వారా అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లను కేటాయించినట్లు స్పష్టం చేశారు.
ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించి సమన్వయంతో ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెక్టోరల్ అధికారులను పోలీసు బందోబస్తు మధ్య రూట్ల వారీగా ఎన్నికల సిబ్బందిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో పాటు వాహనాలలో పోలింగ్ కేంద్రాలకు చేరవేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలో 3 లక్షల 17 వేల 408 మంది పురుషులు, 3 లక్షల 18 వేల 972 మంది స్త్రీలు, 45 మంది ట్రాన్స్ జెండర్లు, 631 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, చెన్నూర్ నియోజకవర్గంలో 14 మంది, బెల్లంపల్లి నియోజకవర్గంలో 13 మంది, మంచిర్యాల నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో అర్హత గల ప్రతి ఒక్కరు ఈ నెల 30వ తేదీన ఉదయం 7 గం||ల నుండి సాయంత్రం 4 గం॥ల వరకు జరిగే పోలింగ్ లో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.