తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా
తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. ప్రభాకర్ రావు 22 ఏళ్ల వయసులోనే విద్యుత్ శాఖలో చేరారు. 2014, జూన్ 5న జెన్ కో సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది అక్టోబర్ 25న ట్రాన్స్కో ఇన్చార్జిగా నియమితులయ్యారు. 54 ఏండ్లపాటు సంస్థకు సేవలు అందించారు. తాజాగా ఈ రోజు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీఎండీ వంటి కీలక పోస్టులో ఐఏఎస్ అధికారులను నియమిస్తుంటారు. అయితే, టీఆర్ఎస్ సర్కారు మాత్రం రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రావును సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవీ కాలం ముగిసిన ప్రతిసారీ ప్రభుత్వం రెండేళ్లపాటు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు బాధ్యతల నుంచి తప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.