మీ తీరు మార్చుకోండి
-ఇక్కడ ఎమ్మెల్యే, అక్కడ ప్రభుత్వం మారింది
-నా తండ్రి ఆశయాలను కొనసాగిస్తా
-కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి
-అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంలా కొట్లాడుతాం
-సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు

పోలీసులు, రెవెన్యూ అధికారులు తమ తీరు మార్చుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే కోనప్ప ఓటమి అనంతరం పలు గ్రామాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు చేయించారని ఆయన తెలిపారు. పోలీసులు గతంలో మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరించకుండా చూడాలని జిల్లా ఎస్పీకి హరీష్‌రావు సూచించారు. సిర్పూరు ఎమ్మెల్యే మారిండు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మారిందని, ఇకనైనా పోలీసు, రెవెన్యూ అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు మాత్రమే రాజకీయాలు.. ఆ తర్వాత అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.
తన గెలుపునకు సహకరించిన బెంగాలీ కులస్తులకు హరీష్‌బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ కులస్తులకు ఎస్సీ సర్టిఫికెట్, సాగునీటి కల్పన, వారి ప్రయాణానికి పశ్చిమబెంగాల్ కు ప్రత్యేక రైలు ఏర్పాటుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్దే ప్రధాన ఎజెండా ముందుకు సాగుతానని వెల్లడించారు. తన తండ్రి దివంగత పురుషోత్తమరావు ఆశయ సాధనాలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హరీష్‌రావు తెలిపారు. అధికార పార్టీలో లేకపోయినా గతంలో తన తండ్రి పనిచేసే విధంగా సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో అసెంబ్లీలో తామే ప్రధాన ప్రతిపక్షంగా కొట్లాడుతామని హరీష్‌రావు స్పష్టం చేశారు.