అక్కడ అన్న… ఇక్కడ తమ్ముడు…

Telangana: ఓ వైపు ముఖ్యమంత్రి ఎవరు..? ఉప ముఖ్యమంత్రి ఎవరు..? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది..? ఇలా పెద్ద ఎత్తున చర్చ సాగుతుండగా, మరోవైపు మంత్రి పదవుల కోసం సైతం నేతలు క్యూ కడుతున్నారు. తమకు మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పార్టీకి తాము విధేయులుగా ఉన్న వైనం.. గతంలో తాము చేసిన పదవులు ఇలాంటివన్నీ చెప్పి మంత్రి ఇప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గడ్డం బ్రదర్స్ ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, తమకే మంత్రి పదవి కావాలని అటు అన్న, ఇటు తమ్ముడు విడివిడిగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో..?
మంత్రి పదవి కోసం గడ్డం బ్రదర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తండ్రికి రాజకీయంగా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని తమకు మంత్రి పదవి వచ్చేలా ముందుకు సాగుతున్నారు. అన్నదమ్ములు ఇద్దరూ ఎవరికి వారుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమకు ఉన్న పరిచయాల ద్వారా వారు మంత్రి పదవి ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే పదవి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరు పదవి తమకంటే తమకని అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఢిల్లీకి వెళ్లిన గడ్డం వినోద్
ఇక బెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్ తనకు మంత్రి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్ నేత సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. తనకు మంత్రి ఇవ్వాలని కోరారు. గతంలో ఆయన రాజశేఖర్రెడ్డి హయాంలో 2004 నుంచి 2009 వరకు మంత్రిగా పనిచేశారు. తనకు ఉన్న అనుభవం దృష్ట్యా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. తాను సోనియాను కలిశానని ఆమెకు లేఖ అందచేసినట్లు వినోద్ మీడియాతో వెల్లడించారు. అదే సమయంలో ఖర్గేను సైతం కలుస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా తనకు ఏ పదవి ఇచ్చినా చేస్తానని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్లో వివేక్ మంతనాలు..
తనకే మంత్రి ఇవ్వాలని వినోద్ తమ్ముడు వివేక్ సైతం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజులుగా ఆయన మంత్రి పదవి కోసం నేతల ద్వారా అధిష్టానికి చెప్పిస్తున్నారు. ఎల్లా హోటల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పదవి కావాలని కోరినట్లు సమాచారం. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వివేక్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేవంత్రెడ్డి ద్వారా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
మరి ఈ ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి వస్తుందా..? లేక ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ పార్టీలు మారి చివరగా కాంగ్రెస్ కు వచ్చారు కాబట్టి.. పార్టీని పట్టుకుని ఉన్న బలమైన నేత ప్రేంసాగర్ రావును మంత్రి పదవి వరిస్తుందా…? వేచి చూడాలి మరి..