జడ్పీటీసీ నుంచి.. ముఖ్యమంత్రి దాకా..
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే..
టీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించనున్నారు. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్లో 2003లో టీఆర్‌ఎస్లో చేరారు. అందులో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో ఆ పార్టీని వదిలిపెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరం టీడీపీలో చేరారు. 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు సాధించారు.
2014లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 అక్టోబర్‌లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి కూడా రాజీనామా చేశారు. ‘కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి’ కోసం పోరాడుతానని ప్రతిజ్ఞ చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పట్లో రేవంత్ రాకను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు చాలా మందే ఉన్నారు. అయితే, కాంగ్రెస్‌లో బలమైన తిరుగులేని నాయకుడిగా అనతికాలంలోనే అగ్ర నాయకత్వానికి దగ్గరయ్యారు. ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. 2018 ఎన్నికల ప్రచారంలో తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని దుమారం రేపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా, కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఆయనను పోటీకి దింపింది. ఆయన విజయంతో పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చారు. హస్తం పార్టీకి అధికారం దక్కించారు.