నేలతల్లి ఆరోగ్యాన్ని రక్షించుకుందాం..
వరంగల్ జోన్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్కుమార్
Coromandel:నేల తల్లి ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరంగల్ జోన్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామచంద్రపురంలో రైతులకు మట్టి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సులో వరంగల్ జోన్ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్కుమార్ మాట్లాడుతూ మానవాళి జీవన మనుగడకు నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. భూసారాన్ని కాపాడుకుంటేనే రాబోయే తరానికి సారవంతమైన నేలను అందిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారని, సేంద్రియ సాగు దిశగా రైతులు సాగాలని కోరారు. నేలలో యేటా సేంద్రియ కర్భన శాతం తగ్గుతూ వస్తున్నదని, దానిని నివారించేందుకు రైతులు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు ఎలా వాడాలో తెలిపారు. ఈ సదస్సులో సంస్థ ప్రతినిధులు, సీనియర్ అగ్రానమిస్ట్ వినోద్ ఉల్చి, రిటైల్ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా మేనేజర్ రాజేష్, పృద్వీ తదితరులు పాల్గొన్నారు.