అక్కడ ప్రమాణం.. ఇక్కడ పరుగెత్తిన అధికార గణం..
Revanth Reddy:ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అపుడే పనులు ప్రారంబించారు. అది కూడా తన విజయానికి బాటలు వేసిన ఉమ్మడి ఆదిలాబాద్ నుండీ.. రేవంత్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంటనే సీఎస్ కి పలు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనుల గురించి ప్రతేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి వేదికగా దళిత గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభ చేపట్టారు. అదే ఉత్సాహంతో ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలోనే తాము బహిరంగ ఏర్పాటు చేసిన ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద స్మృతివనం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఇంద్రవెల్లి సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జరిగిందని కలెక్టర్ తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం గ్రామ సభలో స్మృతివనం ఏర్పాటు కోసం సంబంధిత శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ తో పాటు డీఆర్డీఏ పిడి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఐటిడిఎ డిడి దిలీప్ కుమార్, జడ్పీటీసీ పుష్పలత, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇక ముఖ్యమంత్రి ఆదేశాలతో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బోర్కడ హేమంత్ జోడేఘాట్ సందర్శించి అక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి తెలుసుకున్నారు. మంజూరైన ఇండ్లు పూర్తయిన ఇండ్లు ఇంకా కావాల్సిన ఇళ్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా జోడేఘాట్ లో విద్య రహదారులతో పాటు ఇతర మౌలిక వసతుల అవసరం నివేదిక రూపంలో తయారుచేసి పంపించినట్లు తెలిపారు.