కోలుకున్న కేసీఆర్.. వాకర్ తో నడక

KCR:మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలుకి సర్జరీ పూర్తయింది. దీంతో ఈ రోజు (శనివారం) ఉదయం కేసీఆర్ తో డాక్టర్లు నడిపించారు. వాకర్ సాయంతో నడవటం ప్రాక్టీస్ చేయించారు. ఇద్దరు డాక్టర్లు కేసీఆర్ ను పట్టుకోగా వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లగా నడిచారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిసెంబర్ 7న రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కాలు జారి పడిన విషయం తెలిసిందే. ఆయన ఎడమ కాలి తుంటి విరగడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. డిసెంబర్ 8న రాత్రి డాక్టర్లు కేసీఆర్ కు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయిందని ప్రకటించారు డాక్టర్లు. ఆయన కోలుకోవడానికి ఎనిమిది వారాల టైం పడుతుందని డాక్టర్లు తెలిపారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రామోజీ రావు ఆకాంక్షించారు. త్వరగా కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం అవుతారని రామోజీ రావు ఆకాంక్షించారు. ఈ మేరకు కేటీఆర్కు రామోజీరావు లేఖ రాశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆరా తీశారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అఖిలేష్ యాదవ్ ఫోన్ చేశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అఖిలేష్ యాదవ్ ఆకాంక్షించారు.