షాక్ మీద షాక్

Former MLA Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఆయనకు గతంలో బాకీలు ఉన్న సంస్థలు నోటీసుల మీద నోటీసులు జారీ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే TSRTC నుంచి నోటీసులు అందుకున్న జీవన్ రెడ్డి.. బకాయి పడ్డ తమ నిధుల్ని కూడా వడ్డీతో సహా చెల్లించాలంని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. అధికారులు ఈ నోటీసుల్ని ఆయన ఇంటికి అంటించారు. 2017లో తీసుకున్న రూ. 20 కోట్ల రుణం చెల్లించాలని నోటీసుల్లో ఏపీ ఎస్ఎఫ్సీ పేర్కొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డికి చెందిన విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రై.లి. సంస్థ.. ఆరున్నరేళ్ల కిందట రూ.20 కోట్ల రుణం తీసుకుంది. దీనికి సంబంధించిన అసలు వడ్డీ కలిపి రూ.25 కోట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.45.46 కోట్లు చెల్లించాలని AP SFC నోటీసుల్లో పేర్కొంది.
తాము నోటీసులు జారీ చేసిన తేదీ నుంచి 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే.. రికవరీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. విష్ణుజిత్ సంస్థ ఆర్మూర్‌లోని RTC స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్ పేరిట కాంప్లెక్స్ నిర్మించింది. RTC కి లీజు కింద ఇవ్వాల్సిన రూ.7.23 కోట్లు, విద్యుత్తుశాఖకు రూ.2.5 కోట్లు బకాయి పడటంతో ఆయా సంస్థలు ఈ నెల 7న నోటీసులు జారీ చేశాయి. విద్యుత్తుశాఖ కరెంటు సరఫరా సైతం నిలిపివేసింది. తాజాగా సోమవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణ బకాయిలపై నోటీసులు జారీ చేసింది.