మన తెలుగింటి ఆడపడుచే..

Amrapali: ఆమ్రపాలి… ఈ పేరు వినబడగానే చాలా మంది ఉత్తరాది నుంచి వచ్చిన అధికారిగా పొరబడుతుంటారు.. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆమ్రపాలి గురించి సోషల్ మీడియాలో వాకబు చేసింది కూడా ఆమె ఏ ప్రాంతానికి చెందిన వారనే.. అయితే, ఆమ్రపాలి పదహారు అణాల అచ్చ తెలుగు అమ్మాయి.. ఆమె మన తెలుగింటి ఆడపడుచు. ఆమె సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో ఉంది. ఇంటిల్లిపాదీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులే.. ఆమె సోదరి ఐఆర్ఎస్ అధికారిణి, బావ ఐఏఎస్ కాగా.. భర్త ఐపీఎస్ అధికారి.
అమ్రపాలి.. రెండు మూడేళ్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంలో ఉన్న డైనమిక్ లేడీ అధికారి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ అధికారుల్లో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు శివారులోని నరసాపురం అగ్రహారం ఆమె స్వగ్రామం. దీనిని స్థానికంగా అగ్రహారం రైల్వే గేటు అని వ్యవహరిస్తారు. రైల్వేగేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది ఎన్.అగ్రహారం గ్రామం. ఆమ్రపాలి తండ్రి పేరు వెంకటరెడ్డి.. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన మేనకోడలు పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఎకనమిక్స్ ఫ్రొఫెసర్‌గా ఉద్యోగం చేశారు.
వెంకటరెడ్డి ఇద్దరు కుమార్తెలను బాగా చదివించారు. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్. ఆమె ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. మానస భర్త ప్రవీణ్ కుమార్ తమిళనాడు. ఆయన 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన తమిళనాడు ఐఏఎస్ కేడర్ కాగా.. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.
విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె 39వ ర్యాంక్ సాధించారు.. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె కేంద్రానికి వెళ్లి.. అక్కడ పీఎంవోలో కీలక బాధ్యతల్ని నిర్వహించారు. ఇటీవలే మళ్లీ తెలంగాణకు తిరిగి వచ్చేశారు. ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నారు. అమ్రపాలికి 2018 ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన షమీర్ శర్మ.. ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్పీగా పనిచేస్తున్నారు.