కన్నుల నిండుగ.. అమ్మల పండుగ..

సమ్మక్క, సారలమ్మ జాతరలు మంచిర్యాల జిల్లాలో ఘనంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారక్క గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఓడిబియ్యం, నిలువెత్తు బంగారం సమర్పించారు. కోళ్లు మేకలు బలిచ్చి అక్కడే వంటలు చేసుకున్నారు. గోదావరితీరం జనసంద్రమైంది. మంచిర్యాల నుంచే కాకుండా, చెన్నూరు, మహారాష్ట్రతో సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో జాతర కనులపండువగా సాగింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు పేరిట సమ్మక సారక్క మొక్కు చెల్లించుకున్నారు. 75కిలోల ఎత్తు బంగారాన్ని (బెల్లం) మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత ఆధ్వర్యంలో దేవతలకు సమర్పించారు.
బెల్లంపల్లిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్-జ్యోతి దంపతులు మేడారం సమ్మక్క సారలమ్మ వార్లను కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి దర్శించుకుని తులాభారం తూగి తమ ఎత్తు బంగారం వన దేవతలకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్నాన ఘట్టాలు, క్యూ లైనల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
వనదేవతల జాతరలు కన్నులపండువగా జరిగిన నేపథ్యంలో నేడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు వనప్రవేశం చేయనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాతర అమ్మవార్ల వన ప్రవేశంతో ముగియనుంది. మూడో రోజే భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుని తిరుగుముఖం పట్టారు. తల్లి వెళ్లొస్తం.. మళ్లొస్తం… సల్లగా సూడంటూ వేడుకుంటూ వెనుదిరిగారు. తాము కోరిన కోర్కెలు తీరిస్తే వచ్చే జాతరకు మళ్లీ పిల్లాపాపలతో తిరుగొస్తం అంటూ తల్లుల వద్ద ఆశీస్సులు తీసుకుంటూ సొంత ప్రాంతాలకు పయనమయ్యారు.