ఆ వైన్ షాప్ మూసేయండి
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మద్యం తాగడం మానేలా ప్రమాణాలు చేయడం హర్షనీయం అని, అయితే ఆయన ఇలాకాలో ఉన్న కల్తీ మద్యం అమ్ముతున్న మాధవి వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డైరీ సిఏఓ బోడపాటి షేజల్ అన్నారు. గురువారం మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మాధవివైన్స్ (షాప్ నంబర్10) అబ్కారీ శాఖ అధికారులు తక్షణమే సీజ్ చేయాలన్నారు. అందులో కల్తీ మద్యం అమ్ముతున్నారని దాని వల్ల పేద ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. ఆ వైన్స్ లో రెండు రోజులు నుండి సుమారు రూ. 25,000 విలువైన మద్యం కొనుగోలు చేశామని, ఆ మద్యం అబ్కారి శాఖ అధికారులకు శాంపిల్స్ పంపుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ కమీషనర్, అబ్కారి శాఖ డైరెక్టర్ కి ఫిర్యాదు చేశామన్నారు.
ఆ వైన్స్ షాప్లో సీల్డ్ బాటిల్ మూతలు తీసి నీటిని కలిపి ఇస్తూ నిత్యం లక్షలు రూపాయలు అక్రమంగా ఆర్జీస్తున్నారని అన్నారు. మద్యం ప్రియులకు కిక్కు ఎక్కేవిధంగా స్పిరిట్ కూడా కలుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాధవి వైన్స్ యజమానిపై పలు స్టేషన్ల పరిధిలో కల్తీ మద్యం కేసులు అయ్యాయని గుర్తు చేశారు. ఆమె వెంట ఆరిజిన్ డైరీ సిఈఓ ఆదినారాయణ, ఆళ్ల వంశీకృష్ణ, ఆర్టీ ఐ ఫోరమ్ జిల్లా కమిటీ సభ్యులు రేఖా ప్రియదర్శిని, ఆర్గనైసింగ్ సెక్రటరీ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.