అమ్మతోడు… అడుగుపెడితే..
అమ్మతోడు… అడుగుపెడితే… ఈ ఒక్క మాటే ఇప్పుడు మంచిర్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీకి చెందిన మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వబోమన్న వైఖరితో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు వర్గం ముందుకు సాగుతోంది. అందుకు తాజా ఉదాహరణే దండేపల్లి ఘటన….
తన నియోజకవర్గంలో వాళ్లు అడుగుపెట్టడం ఆ ఎమ్మెల్యేకు ఇష్టం లేదు… అక్కడ పాగా వేసేందుకు ఆ మంత్రి, ఎంపీ ప్రయత్నాలు చేస్తున్నారు. అది కాస్తా ఘర్షణకు దారి తీస్తోంది… మరి ఆ నేతలను ఎమ్మెల్యే ఎందుకు రావొద్దంటున్నారు…? ఆ నేతలు ఎందుకు వస్తామంటున్నారు..? కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న ఆ వైరం వెనక అసలు రహస్యం ఏంటి..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం..
మంచిర్యాల కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు మళ్లీ భగ్గుమంది. సొంత పార్టీ ఎంపీ పర్యటనే ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు వర్గం అడ్డుకోవడం… ఎంపీ వంశీకృష్ణ వర్గం వెనక్కి తగ్గకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో శనివారం పర్యటించారు. ఆయన పాఠశాలల పిల్లలకు బ్యాగులు అందించే కార్యక్రమం పెట్టుకున్నారు. దీంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావు వర్గం ఆయన పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేసింది. సొంత పార్టీ కార్యకర్తలే ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీలను చింపేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు మరో వర్గం నాయకులు సమాచారం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అయితే, ఆయన పర్యటన అడ్డుకోవడం వెనక కేవలం సమాచార లోపమే కాదు… ఆయన ఇక్కడ అడుగుపెట్టవద్దనే ఆలోచన కూడా ఉంది. మంచిర్యాల నియోజకవర్గంలో మంత్రి గడ్డం వివేక్, ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, ఆయన వర్గం పనిచేస్తోంది. వాళ్లు ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిర్యాల నియోజకవర్గంలో అడ్డుపెట్టవద్దని ప్రేంసాగర్ రావు ప్రతిజ్ఞ చేశారు. అదే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఇప్పటికీ మంత్రి వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. ఇక, ఎంపీ వంశీకృష్ణ కూడా మంచిర్యాల అడుగుపెట్టలేదు. ఒకటి రెండు సార్లు ఆయన ప్రయత్నం చేసినా… సొంత పార్టీ నేతలే వ్యతిరేకించారు.
ఇంతకీ ప్రేంసాగర్ రావు ఆగ్రహానికి కారణం ఏంటనే రాజకీయ వర్గాల్లో చాలా మందికి తెలిసిందే. తనకు రావాల్సిన మంత్రి పదవి వివేక్ పట్టుకుపోయారని ఆగ్రహం ఆయన మనసులో ఉంది. ఎన్నికలకు ముందు మీ మంత్రి పదవికి తాను అడ్డు రానని చెప్పిన వివేక్ గెలవగానే తన ప్రయత్నాలు తాను చేసుకుని మంత్రి అయ్యారు. తమ నేతకు జరిగిన అన్యాయానికి కారణం, తమ నేతకు దక్కాల్సిన మంత్రి పదవి గద్దలా తన్నుకుపోయిన గడ్డం వివేక్‌పై ప్రేంసాగర్ రావు అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేంసాగర్ రావు, ఆయన అనుచరవర్గం తమ నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని ఏకంగా మంత్రి వివేక్‌కే అల్టిమేటం జారీ చేశారు. ఆయనతో పాటు ఎంపీ వంశీకృష్ణను సైతం అడ్డుకుంటున్నారు.
వాస్తవానికి మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ సైతం నిన్నా, మొన్నటి వరకు మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు ముందు వెనకా ఆలోచించారు. కానీ, ప్రేం సాగర్ రావు ఆరోగ్యం బాలేక హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ మంచిర్యాలలో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అడుగుపెడితే తమ కుటుంబం జిల్లాపై పరిపూర్ణంగా పట్టు సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. అయితే, ప్రేంసాగర్ రావు అడ్డుకోవడంతో అది సాధ్యం కావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అడుగు పెట్టాలని మంత్రి, ఎంపీ ప్రయత్నిస్తుంటే… ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఎట్టి పరిస్థితుల్లో అది జరగదంటూ భీష్మించుకున్నారు… చివరకు ఏం జరుగుతుందో చూడాలి మరి…