నిర్ల‌క్ష్యానికి మూల్యం… సీఐ, ఎస్ఐ స‌స్పెన్ష‌న్‌

కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసులో పోలీసు అధికారుల సస్పెన్షన్‌తో వ్యవహారం మరింత కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరికొందరిపై కూడా చర్యలు ఉండే అవకాశముండటంతో ఈ కేసుపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు సంబంధించిన రోడ్డు ప్రమాదం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో కాశీబుగ్గ సీఐ ఎన్ని రామకృష్ణ, ఎస్సై సునీల్‌లను సస్పెండ్ చేస్తూ విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరికొందరు పోలీసు సిబ్బందిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాశీబుగ్గ రోడ్డు ప్రమాదం కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై శాఖ కఠిన చర్యలు చేపట్టింది. మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు సంబంధించిన ఈ ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలాన్ని సీఐ, ఎస్సై స్వయంగా సందర్శించకపోవడం, దర్యాప్తు బాధ్యతలను దిగువ స్థాయి సిబ్బందికి అప్పగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ప్రమాదం జరిగిన రాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించడంలో జాప్యం జరిగినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో కీలక ఆధారాలు కోల్పోయి, అసలు నిందితుడిని తప్పించేందుకు అవకాశం కల్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ప్రమాదంతో సంబంధం లేని సిద్ధార్థ అనే వ్యక్తిని నిందితుడిగా చూపించి, అతడిని లొంగిపోయేలా చేసి కేసును 41 నోటీసుతో ముగించే ప్రయత్నం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అసలు నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరవ్ వర్మను కేసు నుంచి తప్పించేందుకు సీఐ, ఎస్సై సహకరించారనే అభియోగాల నేపథ్యంలో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎస్సై సునీల్‌ను వీఆర్‌కు పంపిన అధికారులు.. అనంతరం సీఐ రామకృష్ణను కూడా వీఆర్‌కు పంపించారు. ఆ తర్వాత ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఈ కేసులో సీఐ, ఎస్సైలతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది పాత్రపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ముగ్గురు కానిస్టేబుళ్లు, మరో అధికారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ప్రమాదం జరిగిన అనంతరం స్టేషన్‌లో నమోదైన వివరాలను మాజీమంత్రికి చేరవేసినట్లు, అలాగే మాజీమంత్రి, ఆయన అనుచరులతో పలువురు పోలీసు సిబ్బంది ఫోన్‌లో మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like