వ‌రి వ‌ద్దు.. ప్ర‌త్యామ్నాయ పంట‌లు వేయండి..

మంత్రి గ‌డ్డం వివేకానంద పిలుపు

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ సీజన్‌లో వరి సాగుకు దూరంగా ఉండి, నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద పిలుపునిచ్చారు. చెన్నూర్‌లో జరిగిన రైతుల అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందని, రాబోయే మూడు నెలల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున రైతులంతా ఒకే నిర్ణయంతో ఈ ఖరీఫ్‌లో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని కోరారు. చెన్నూర్‌లో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల అవగాహన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… పప్పుధాన్యాలు, పత్తి, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందని చెప్పారు.

కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతులు భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన రాయితీ విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం మంత్రి గడ్డం వివేకానంద చెన్నూర్లో రూ.1.40 కోట్ల డీఎంఎఫ్‌టీఈ నిధులతో నిర్మించిన బైపాస్ రోడ్డు ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, ఆసుపత్రులు, సంక్షేమ వసతి గృహాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మైనారిటీ బాలుర సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి. విద్యార్థులకు అందుతున్న భోజనం, విద్య, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like