పెట్రోల్ దాడి విషాదాంతం.. కాంగ్రెస్ కార్యకర్త మృతి

కాంగ్రెస్ కార్యకర్తపై జరిగిన పెట్రోల్ దాడి విషాదాంతమైంది. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకుడు ఆడెపు మహేష్.. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది.

వరంగల్ నగరంలోని ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ రాష్ట్ర కోఆర్డినేటర్, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఆడెపు మహేష్‌పై శనివారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. జన్ను మధు అనే వ్యక్తి ఫోన్ చేయడంతో కోటిలింగాల ఆలయం సమీపానికి వెళ్లిన మహేష్‌పై అక్కడ ఉన్న రౌడీషీటర్ పత్తి కుమార్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు తన గురించి ఏమి చెప్పావంటూ వాగ్వాదానికి దిగిన అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు బాధితుడు చికిత్స సమయంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

తీవ్రంగా కాలిన గాయాలైనా మహేష్ అక్కడి నుంచి ఎన్‌టీఆర్ నగర్ వరకు చేరుకుని స్థానికులకు విషయం చెప్పాడు. వెంటనే ఆయనను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సుమారు 60 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మహేష్ మృతితో కేసును హత్య కేసుగా మార్చిన పోలీసులు.. ప్రధాన నిందితుడు పత్తి కుమార్‌తో పాటు ఇతరుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఘటన అనంతరం ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్ దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ కార్యకర్త మహేష్ మృతితో వరంగల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like