తిరుగుబాటు..

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు… అటవీశాఖ అధికారులకు మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయా…? కవ్వాల్ టైగర్ రిజర్వ్ పేరుతో అమాయక ఆదివాసులను వేధిస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తున్నారని… కొందరు అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవ‌ర్టులుగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఎమ్మెల్యే-అటవీశాఖ మధ్య విభేదాలకు కారణమేంటి…? ఆదివాసుల సమస్యల వెనుక అసలు కథేంటి…? నాంది న్యూస్ స్పెషల్ రిపోర్ట్‌లో.

కవ్వాల్ టైగర్ రిజర్వ్(Kawal Tiger Reserve)… అడవుల సంరక్షణ కోసం అమలు చేస్తున్న నిబంధనలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్… అటవీశాఖ అధికారుల తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. పులులే లేని టైగర్ జోన్ పేరుతో అమాయక ఆదివాసులను వేధిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్థులపై అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆయ‌న దుయ్య‌బ‌డుతున్నారు. కొందరు అధికారులు గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఎమ్మెల్యే అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అటవీశాఖ అధికారులు ముఖ్యంగా ఎఫ్డీపీటీ శాంతారాం, డీఎఫ్ ఓ, ఎఫ్డీఓ తోపాటు ఇందన్ పల్లి, జన్నారం, కడెం, ఖానాపూర్, దండేపల్లి ఎఫ్ఆర్ తీరు సరిగా లేదని దుమ్మెత్తిపోస్తున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం(Shantharam, Field Director of Kawal Tiger Zone) బీఆర్ఎస్ కు, కేటిఆర్ కు తొత్తుగా మారి కాంగ్రెస్ ఎమ్మెల్యేను అవమానించే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వంను బద్నాం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి చెత్త అధికారులపై పీసీసీఎఫ్, అటవీశాఖ మంత్రి బదిలీ వేటు చేయాలని పలు మార్లు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. కానీ అధికారులు ఇక్కడి నుంచి బదిలీ కాకపోవడం సైతం ఆ ఎమ్మెల్యేకు మింగుడుపడని అంశంగా మారింది.

రెండు రోజుల కింద‌ట ఇంధన్‌పల్లి రేంజ్ పరిధిలో ఐదుగురు ఆదివాసీ యువకులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ల‌క్ష్మీనారాయణ వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. దీంతో ఆదివాసులు అర్ధరాత్రి అటవీశాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆదివాసులను విడుదల చేసే వరకు తాను అక్కడి నుంచి కదలనని ప్రకటించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ ఘటనపై ఆదివాసి హక్కుల సంఘం ‘తుడుం దెబ్బ’ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంధన్‌పల్లి ఎఫ్‌ఆర్‌వోతో పాటు సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. లేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీశాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించింది. అయితే మరోవైపు అటవీశాఖ అధికారులు అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, అక్రమ ఇసుక రవాణా, అటవీ ఆక్రమణల నివారణ కోసం చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై అటవీశాఖ నుంచి అధికారికంగా పూర్తి స్థాయి స్పందన రావాల్సి ఉంది.

అటవీశాఖ అధికారులపై అధికార పార్టీ ఎమ్మెల్యే వరుస ఆరోపణలు చేయడం… వాటికి ఆదివాసి సంఘాలు మద్దతు పలకడం… ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు వ‌దిలేది లేద‌ని బొజ్జు డెడ్‌లైన్ సైతం విధించారు. అట‌వీ శాఖ అధికారుల‌కు వ్య‌తిరేకంగా ఓ సామ్రాజ్యం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నానికి కార‌ణ‌మైంది…. మ‌రి ఈ స‌మ‌స్య ఎలా ముగుస్తుంద‌నేది తేలాల్సి ఉంది…

 

 

You might also like