ఇన్‌స్టా రీల్స్ వివాదం.. ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగానికే ముగింపు పలికింది. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ టీచర్ గౌతమి రాజీనామా ప్రకటించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సస్పెన్షన్ తర్వాత విధుల్లో చేరినా… మానసిక వేధింపులు, ట్రోలింగ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెబుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తున్న ఈ కథనంలో…
ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల ప్రమోషన్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదంలో ఆమెపై విద్యాశాఖ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆ కేసులో ఆమె ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు.
ఇటీవల సస్పెన్షన్ గడువు ముగియడంతో గౌతమి తిరిగి విధుల్లో చేరారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా పరిస్థితులు మారలేదని ఆమె ఆరోపిస్తున్నారు. తోటి ఉద్యోగుల నుంచి ట్రోలింగ్, అవమానకర వ్యాఖ్యలు, మానసిక వేధింపులు ఎదుర్కొంటున్నానని గౌతమి వెల్లడించారు. ఈ పరిణామాలు తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగడం సాధ్యం కాదని భావించిన గౌతమి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన ఆత్మగౌరవం, మానసిక ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. గౌతమి రాజీనామా వ్యవహారం ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఆమె రాజీనామాను విద్యాశాఖ అధికారులు ఆమోదిస్తారా? ఆమె చేసిన మానసిక వేధింపుల ఆరోపణలపై విచారణ చేపడతారా? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వివాదంతో ప్రారంభమైన ఈ వ్యవహారం… ఇప్పుడు ప్రభుత్వ టీచర్ రాజీనామా వరకు చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. గౌతమి చేసిన ఆరోపణలపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుంది? ఆమె రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది వేచి చూడాల్సి ఉంది.