ప్రభుత్వ జూనియర్ కళాశాలల రికార్డు..
-ప్రవేశాల కోసం విద్యార్థుల క్యూ
-85 వేల మార్క్ దాటిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు
-గతేడాదితో పోల్చితే 14 శాతం పెంపు
-ప్రభుత్వ కళాశాలలపై పెరుగుతున్న విశ్వాసమన్న టీజీబీఐఈ కార్యదర్శి అభిలాష అభినవ్
తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (11వ తరగతి)లో మొత్తం 85,453 మంది విద్యార్థులు చేరారు. గత ఏడాది సుమారు 75 వేల మంది విద్యార్థులు చేరగా, ఈసారి ప్రవేశాలు దాదాపు 14 శాతం పెరిగాయి. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి, రెండో సంవత్సరం కలిపి మొత్తం 1,64,730 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు (టీజీబీఐఈ) కార్యదర్శి అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమల భాగస్వామ్యాల కారణంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రజల నమ్మకం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం నాణ్యమైన, సమ్మిళిత, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
పరిశ్రమలతో భాగస్వామ్యాలు.. ఉపాధికి కొత్త అవకాశాలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఐబీఎం సహకారంతో డిజిటల్ నైపుణ్యాలు, పరిశ్రమ ధ్రువీకరణ కోర్సులు అందిస్తుండగా, హెటెరో ఫార్మాస్యూటికల్స్తో భాగస్వామ్యం ద్వారా లైఫ్ సైన్సెస్, వృత్తి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్యాభివృద్ధి, క్యాంపస్ నియామక అవకాశాలు కల్పిస్తున్నారు. హెటెరో సంస్థ 300 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పరిశ్రమల భాగస్వామ్యాల ద్వారా 2,000కు పైగా ప్లేస్‌మెంట్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.
విద్యా సంస్కరణలకు ప్రాధాన్యం
విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధం చేసే దిశగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. అలాగే క్యూ ఆర్ కోడ్‌లతో కూడిన డిజిటల్ పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చి, వీడియో లెక్చర్లు, డిజిటల్ స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సులభంగా పొందేలా చర్యలు చేపట్టారు. ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు నాయకత్వం, బోధనా నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. 40 కళాశాలల్లో ఆధునిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.90 కోట్లు, 416 కళాశాలల్లో క్రీడా మౌలిక సదుపాయాల కోసం రూ.1.04 కోట్లు, కంప్యూటర్ గదుల ఏర్పాటు, ఆధునికీకరణకు రూ.20 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. అలాగే గ్రంథాలయాల అభివృద్ధి, ప్రయోగశాలల నిర్వహణ, కాంపోజిట్ స్కూల్ గ్రాంట్లు, ఎకో క్లబ్‌ల కోసం కూడా ప్రత్యేక నిధులు విడుదల చేసింది. ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, పౌష్టికాహారం వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం
విద్యా కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష పథకాల అమలు, SNA-SPARSH పోర్టల్ వినియోగం, ఆర్థిక నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అందించే సేవలపై శిక్షణ ఇచ్చారు. అలాగే పోష్ చట్టం-2013పై అవగాహన సదస్సులు నిర్వహించి, మహిళల భద్రత, లింగ సున్నితత్వం, సురక్షిత విద్యా వాతావరణం వంటి అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ కళాశాలలపై పెరుగుతున్న విశ్వాసం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నమోదవుతున్న రికార్డు స్థాయి ప్రవేశాలు, నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, పరిశ్రమలతో అనుసంధానం, విద్యార్థుల సంక్షేమ చర్యల పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్‌కు సిద్ధం చేసే నాణ్యమైన, అందుబాటు ఇంటర్మీడియట్ విద్య కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థుల తొలి ఎంపికగా మారుతున్నాయని తెలిపారు.