ఢిల్లీకి రేవంత్.. మంత్రులపై వేటు?
-రెండు రోజుల పాటు పర్యటన
-ఏఐసీసీ పెద్దలతో చర్చించనున్న రేవంత్
-మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై వేటు?
-పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
-వైఎస్ఆర్ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ప్రత్యేక విశిష్ట అతిథిగా
తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలకు ఢిల్లీ వేదిక కానుందా..? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్నారు. ఏఐసీసీ పెద్దలతో సీఎం భేటీ కానున్న నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha), ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి(Planning Commission Vice-Chairman Chinna Reddy) వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై కీలక చర్చ జరిగే అవకాశముంది. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపైనా సీఎం చర్చించనున్నారు. ఇంతకీ ఢిల్లీ పర్యటనలో ఏం జరగబోతోంది..? ఎవరిపై వేటు పడబోతోంది..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ఏఐసీసీ అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారంపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjun Kharge), ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(AICC General Secretary K.C. Venugopal)తో రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలన్న అభిప్రాయంతో రేవంత్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కొందరు సీనియర్ నేతలు ఆమెపై చర్యలు తీసుకోవద్దని అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ భేటీల తర్వాత తుది నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పులు, చేర్పులపైనా ఢిల్లీ పర్యటనలో చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మెట్రో రైలు ప్రాజెక్టుపై, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మామునూరు విమానాశ్రయ పురోగతిపై సీఎం చర్చించనున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తోనూ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు, డిఫెన్స్ సంస్థలతో ఒప్పందాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే వైఎస్ఆర్ అవార్డు ప్రదాన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్‌రావు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, జైరాం రమేష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు హాజరుకానున్నారు.
మొత్తంగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఏఐసీసీ పెద్దలతో రాజకీయ, క్రమశిక్షణ అంశాలపై చర్చలు.. మరోవైపు కేంద్ర మంత్రులతో రాష్ట్ర ప్రాజెక్టులపై సమావేశాలు.. ఇంకోవైపు వైఎస్ఆర్ అవార్డు కార్యక్రమం. అయితే కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఢిల్లీ భేటీల తర్వాతే ఈ అంశంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.