తెలంగాణ స‌ర్కారుకు హైకోర్టులో ఊర‌ట

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల విషయంలో సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌తో సింగిల్‌ జడ్జి స్టే విధించారు. దీన్ని ప్రభుత్వం అప్పీల్ చేయ‌గా, అడ్వొకేట్‌ జనరల్‌ వినిపించిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న డివిజన్‌ బెంచ్‌ స్టే ఎత్తివేసింది.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసింది. దీంతో పథకాల అమలుకు ఏర్పడిన తాత్కాలిక న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. దీంతో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల అమలుకు తిరిగి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పథకాల అమలు కోసం 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్‌ చేస్తూ లాయర్ విజయ్‌గోపాల్‌ వ్యక్తిగత హోదాలో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్‌ దాఖలు చేయకపోవడంతో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల అమలుపై స్టే విధిస్తూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పథకాల అమలుపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ అప్పీలుపై మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2014 నుంచి అమలు అవుతున్న సంక్షేమ పథకాలను వ్యక్తిగతంగా సవాల్‌ చేసే హక్కు పిటిషనర్‌కు లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పథకాల వల్ల పిటిషనర్‌కు ఎలాంటి వ్యక్తిగత హక్కుల భంగం జరగలేదని.. ఆయన పథకం లబ్ధిదారు కూడా కాదని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డి వాదించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన అంశాలను సవాల్‌ చేసినందున ఈ కేసును విచారించే పరిధి డివిజన్‌ బెంచ్‌కు ఉందని తెలిపారు. షాదీముబారక్‌ వంటి సంక్షేమ పథకాన్ని సుప్రీంకోర్టు అనుమతించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకం కూడా ఉందని వివరించారు.

పేద కుటుంబాలకు చెందిన యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. బాల్య వివాహాల నియంత్రణకు ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు దోహదపడుతున్నాయని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వినిపించిన వాదనలను పరిశీలించిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌.. పథకాల అమలుపై సింగిల్‌ జడ్జి విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

You might also like