భూగర్భ గనుల ప్రైవేటీకరణ అవాస్తవం
భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదు: సింగరేణి యాజమాన్యం
సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. భూగర్భ గనులను ప్రైవేటీకరించే ఎటువంటి ప్రతిపాదన ప్రస్తుతం సంస్థ పరిశీలనలో లేదని తెలిపింది.
బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా, మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ గనులు, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధికి సంస్థ నిరంతరం తోడ్పడుతోందని పేర్కొంది.
నష్టాల్లో ఉన్నా భూగర్భ గనుల కొనసాగింపు
సింగరేణిలోని భూగర్భ గనులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో ఉపాధి కల్పన, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గిస్తూ, భూగర్భ గనుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
శాంతిఖని గనిపై ఈఓఐ కేవలం పైలట్ అధ్యయనం కోసమే
భారీ నష్టాల్లో కొనసాగుతున్న శాంతిఖని భూగర్భ గనిలో ఉత్పత్తి కార్యకలాపాలను ఎండీఓ (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్) విధానంలో నిర్వహించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించగలమా, నష్టాలను నివారించగలమా అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ప్రతిపాదన రూపొందించినట్లు సింగరేణి యాజమాన్యం వివరించింది.
ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 2న ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ప్రకటన జారీ చేసి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. తొలుత జనవరి 15 వరకు గడువు ఇవ్వగా ఏ సంస్థా ఆసక్తి వ్యక్తం చేయలేదు. అనంతరం గడువును జనవరి 22 వరకు పొడిగించగా ఒక సంస్థ మాత్రమే ముందుకొచ్చింది. అయితే తదుపరి దశలో ఆ సంస్థ కూడా ప్రక్రియలో కొనసాగేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.
తగిన స్పందన లభించకపోవడంతో శాంతిఖని గనికి సంబంధించిన ఈ ప్రతిపాదనను ఇప్పటికే విరమించుకున్నట్లు సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రైవేటీకరణ ప్రచారం వాస్తవ విరుద్ధం
శాంతిఖని గనికి సంబంధించి జారీ చేసిన ఈఓఐని ఆధారంగా చేసుకుని సింగరేణి భూగర్భ గనులను ప్రైవేటుపరం చేస్తోందని ప్రచారం చేయడం వాస్తవ విరుద్ధమని యాజమాన్యం పేర్కొంది. భూగర్భ గనులను మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేయడం సంస్థ విధానం కాదని స్పష్టం చేసింది.
భూగర్భ గనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, నష్టాలను తగ్గించడం, సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉపాధి కల్పించడమే సింగరేణి యాజమాన్యం ప్రధాన లక్ష్యమని తెలిపింది.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇటువంటి వార్తలను ప్రచురించడం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని యాజమాన్యం పేర్కొంది. కాబట్టి సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది.