ఆదిలాబాద్‌లో గణేశ్ భక్తుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేశ్ భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో గ‌ణేష్‌ శోభాయాత్ర నిలిచిపోయింది. గణేశ్ మండళ్ల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిమజ్జన ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల గణపతుల నిమజ్జనం పూర్తయినా.. మరికొన్ని గణేశ్ విగ్రహాల శోభాయాత్ర నిలిచిపోయింది. ప‌లువురు భక్తులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపైనే కూర్చొని భజనలు చేస్తూ నిరసన తెలిపారు.

విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని గణేశ్ మండళ్ల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ స్వయంగా అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎస్పీ వచ్చి కొబ్బ‌రికాయ‌ కొట్టి శోభాయాత్రను తిరిగి ప్రారంభించాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

దీంతో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శోభాయాత్ర నిలిచిపోవడంతో రహదారిపై భారీగా భక్తులు, గణేశ్ మండళ్ల నిర్వాహకులు చేరారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

You might also like