కలెక్టర్ హామీతో.. కదిలిన శోభాయాత్ర
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజర్షిషా హామీతో తిరిగి శోభాయాత్ర ప్రారంభం అయ్యింది. అంబేద్కర్ చౌరస్తా వద్ద గణేశ్ భక్తులు ఆందోళనకు దిగడంతో గణేష్ శోభాయాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. గణేశ్ మండళ్ల నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. వెంటనే నిమజ్జన ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు. పలువురు భక్తులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపైనే కూర్చొని భజనలు చేస్తూ నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. ఆందోళన విరమించాలని గణేశ్ మండళ్ల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎస్పీ స్వయంగా అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎస్పీ వచ్చి కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను తిరిగి ప్రారంభించాలని హిందూ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
దీంతో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కు వచ్చిన కలెక్టర్ రాజర్షి షా వారికి నచ్చజెప్పారు. విచారణ చేపట్టి బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిగతా నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. హిందూ సంఘాల డిమాండ్లకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మరోవైపు అడిషనల్ ఎస్పీ సైతం అదుపులో తీసుకున్న వారిని వదిలేస్తామని హామీ ఇచ్చారు. డీజే లు, బ్యాండ్ లను తీసుకొని ఉంటే ఇచ్చేస్తామన్నారు. ఎలాంటి కేసులు నమోదు చేయమని స్పష్టం చేయడంతో సమస్య పరిష్కారం అయ్యింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ శోభా యాత్ర తిరిగి ప్రారంభించారు.