ఇకపై 30 రోజుల రీచార్జీ ప్లాన్లు
భారతదేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం, టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) సరికొత్త నిబంధనలతో కూడిన ఒక పెద్ద శుభవార్తను అందించాయి. టెలికాం కంపెనీల 28 రోజుల రీఛార్జ్ వ్యూహానికి ముగింపు పలుకుతూ, పూర్తిగా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లను తప్పనిసరిగా తీసుకురావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా “టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026” ను అమలులోకి తెచ్చింది.
ఏడాదికి 12 రీఛార్జ్‌లు మాత్రమే
ఇప్పటివరకు టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట కేవలం 28 రోజుల వ్యాలిడిటీని మాత్రమే ఇవ్వడం వల్ల, వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. తాజా నిబంధనలతో ఇకపై 30 రోజుల ప్లాన్ ఎంచుకుంటే, సంవత్సరానికి 12 సార్లు రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంటర్నెట్ డేటాతో అవసరం లేని సాధారణ మొబైల్ వినియోగదారులు లేదా వృద్ధుల కోసం టెలికాం కంపెనీలు ఇకపై ప్రత్యేకంగా చౌకైన వాయిస్ కాల్స్, SMS ప్లాన్లను (STVs) కూడా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతో కచ్చితంగా అందుబాటులో ఉంచాలి.
ప్రతి నెలా ఒకే రోజున రెన్యూవల్
ప్రతి నెల ఒకే తేదీన రీఛార్జ్ ప్లాన్ ఆటోమేటిక్‌గా పునరుద్ధరించబడే (Renew) ఒక ప్రత్యేక ఆప్షన్‌ను కూడా కంపెనీలు అందించాలి.రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్ఢా పార్లమెంట్‌లో ఈ 28 రోజుల రీఛార్జ్ గడువుపై వినియోగదారుల తరఫున గళం ఎత్తగా, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం, TRAI ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఈ నిర్ణయం ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.
కేంద్రానికి, ట్రాయ్‌కు కృతజ్ఞతలు..
ట్రాయ్ నిర్ణయంపై బీజేపీ ఎంపీ రాఘవ్ చడ్ఢా స్పందిస్తూ, ఇది కన్‌స్ట్రక్టివ్ పాలిటిక్స్‌కు మంచి ఉదాహరణ అని అన్నారు. ప్రజలు తనతో పంచుకున్న ప్రీపెయిడ్ రీఛార్జ్ సమస్యలను మార్చి 11న పార్లమెంట్‌లో ప్రస్తావించానని చెప్పారు. 12 నెలలు ఉన్న ఏడాదిలో 13 రీఛార్జ్‌లు చేయాల్సి రావడం, 28 రోజుల స్థానంలో 30 రోజుల ప్లాన్లు తీసుకురావాల్సిన అవసరం ఉందని అప్పట్లో చెప్పినట్లు గుర్తుచేశారు. డేటా ఉపయోగించని వినియోగదారుల కోసం వాయిస్-ఓన్లీ ప్లాన్లు ఉండాలని కోరినట్లు తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వం వినియోగదారుల సమస్యలను పరిష్కరించిందని చడ్ఢా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ట్రాయ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన ప్రజా సమస్యలను కలిసి పరిష్కరించుకునే విధంగా ఇలాంటి చర్యలు కొనసాగాలని ఆకాంక్షించారు.