కాగజ్‌నగర్‌లో మూడో రోజుకు చేరిన మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మె

దసరా పండుగ వేళ కూడా వేతనాలు అందకపోవడంతో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగ‌జ్ న‌గ‌ర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న స‌మ్మె మూడవ రోజుకు చేరింది. మునిసిపల్ కార్మికులు త‌మ విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కమిషనర్ ని కార్యాలయంలోనికి వెల్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. చేతిలో డ‌బ్బులు లేకుండా పండ‌గ ఎలా జరుపుకోవాల‌ని తమకు రావాల్సిన‌ ఒక నెల జీవితం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

కాగజ్ న‌గ‌ర్ పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నెల రోజులుగా వేతనాల కోసం ఎదురుచూన్నారు. పండుగ సమయంలోనూ వేతనాలు అందకపోవడంతో కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో త‌మ‌కు న్యాయం చేయాల‌ని, త‌మ‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని మూడు రోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్య‌క్తం చేస్తున్నారు. జీతాల గురించి అడిగితే మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ ఖజానాలో నిధులు లేవని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు రూ.5 వేల అడ్వాన్స్ ఇస్తామని చెప్పడంతో వారు తిరస్కరించారు. అడ్వాన్స్‌లు తమకు వద్దని, పెండింగ్‌లో ఉన్న పూర్తి వేతనాలను వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.

You might also like