లోపల చర్చలు.. బయట నిరసనలు.. స్టాలిన్ ఇంటి వద్ద హైటెన్షన్!

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నిన్న చేసిన ప్రకటనతో విపక్ష ఇండియా కూటమి అప్రమత్తమైంది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం చెన్నై చేరుకున్న ఇండియా కూటమి పార్టీల అగ్రనేతలు స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి వచ్చిన కాంగ్రెస్ కూటమి నేతలకు స్టాలిన్ ఆత్మీయ స్వాగతం పలికారు. స్టాలిన్‌తో సమావేశమైన ఇండియా కూటమి నేతలు డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

స్టాలిన్‌తో ఇండియా కూటమి నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీ కనిమొళి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని, ఇతర పార్టీల వైఖరి ఏంటో వారినే అడగాలని తెలిపారు. డీఎంకే విషయానికి వస్తే తమ పార్టీ నాయకుడు ఇప్పటికే ఎంపీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారని, ఈ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయమే పార్టీ తుది నిర్ణయం అవుతుందని స్పష్టం చేశారు. ఇండియా కూటమి నేతలు కూడా తమ నేతను కలిసేందుకు వచ్చారని, వారితో చర్చలు పూర్తయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలపై వివరంగా చెబుతామ‌ని పేర్కొన్నారు.

ఇండియా కూటమి నేతల రాకను వ్యతిరేకిస్తూ డీఎంకే కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. స్టాలిన్ ఇంటి వద్ద కాంగ్రెస్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్‌తో ఈ రోజు రాత్రి ఇండియా కూటమి నేతలు కలవనుండటంపై బీజేపీ నేతలు స్పందిస్తూ.. ఇప్పటికే బాగా ఆలస్యమైందని వ్యాఖ్యానిస్తున్నారు.

స్టాలిన్‌తో సమావేశమైన వారిలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ నేత వీడీ సతీశన్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సీపీఎం నేత ఎం.ఏ. బేబీ తదితర ఇండియా కూటమి నేతలు ఉన్నారు.

You might also like