గడ్డి తిన్నారు…
-దాణా కుంభకోణంలో లాలూను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు
-ఇప్పటికే 3.5 ఏండ్లు శిక్ష అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి
దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. జనవరి 29న డిఫెన్స్ తరపున వాదనలు పూర్తి చేసిన తర్వాత.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం ఈ అతిపెద్ద సంచలనాత్మకమైన దాణా కుంభకోణంపై తీర్పు వెలువరించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈ మొత్తం కేసు 1990-1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇది దాణా కుంభకోణంలో అతిపెద్ద కేసు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 575 మంది సాక్షుల వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసులో వాదనలు 7 ఆగస్టు 2021న పూర్తయ్యాయి.
ఈ కేసు విచారణ నిమిత్తం లాలూ 24 గంటల ముందే రాంచీ చేరుకున్నారు. 25 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అయితే ఈ దాణా కుంభకోణంలో రూ.950 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 1996లో తొలిసారి దొరండా ట్రెజరీ కేసు నమోదైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 55 మంది ఇప్పటికే మరణించారు. లాలూప్రసాద్ యాదవ్ ప్రభుత్వం పశువుల మేత కోసం నిధులు దుర్వినియోగం చేసినట్ల కేసులు నమోదు అయ్యాయి. దాణా కుంభకోణం కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష పడగా, లాలూప్రసాద్ యాదవ్ ఇప్పటి వరకు 3.5 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవించారు.