గర్భిణీని చంపేందుకు ప్లాన్
జ్యూస్‌లో పురుగుల మందు కలిపి ఇచ్చిన అత్త, మామ, భర్త చికిత్స పొందుతూనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తెల్లవారి మరణించిన శిశువు
Plan to kill the pregnant woman: ఇష్టం లేని పెండ్లి చేసుకుని వచ్చిన కొడలు పట్ల కర్కశంగా వ్యహరించిన అత్తింటివారి బాగోతమిది. వారు చేసిన పనికి ఈ భూమి అడుగుపెట్టిన చిన్నారి బలయ్యింది. సిర్పూర్ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన డుర్కే కవిత, కోట మహేందర్ ఇద్దరు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శారీరకంగా కలవడం వలన కవిత గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి గత సంవత్సరం ఆగస్టు లో ఇరువురికి వివాహం జరిపించారు. కాగా వివాహం అయిన వారం రోజుల నుండే అత్తవారింట్లో వేధింపులు మొదలయ్యాయి. ఇటు భర్త, అత్త మామల వేధింపులు తాళలేక కవిత తన పుట్టింటికి వచ్చి ఉంటోంది.
కవిత కడుపులో ఉన్న బిడ్డతో పాటు ఆమెను చంపాలని డిసెంబరు 29 న ఆమె భర్త కోట మహేందర్ తన తల్లిదండ్రుల కోట విమల, కోట లహాను సహాయంతో జ్యూస్ లో పురుగుల మందు కలిపి తాగించారు. అది తాగిన కొద్ది సేపటికే రక్తం కక్కుకొని కింద పడిపోగా ఆమె బంధువులు చూసి కవితను కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మంచిర్యాల ఆసుపత్రిలో చేర్పించారు. డిసెంబర్ 30న కవిత ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తెల్లవారే ఆ చిన్నారి మృత్యువాడ పడింది.
కవిత ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. కవిత తండ్రి డుర్కే పెంటు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిత భర్త కోట మహేందర్, అత్త మామ కోట విమల, లహానుపై కేసు నమోదు చేసి గురువారం వారిని రిమాండ్ కు పంపించినట్లు కౌటాల సీఐ బుద్దె స్వామి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సిర్పూర్-టి ఎస్ఐ ఢీకొండ రమేశ్, పొలీస్ సిబ్బంది పాల్గొన్నారు.