పేదోళ్ల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
Balka Suman: సింగరేణి స్థలాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న ప్రజల సొంతింటి కల నెరవేరుస్తున్న ప్రభుత్వం తమదేనని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన 5వ విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఖాళీ స్థలాలలో నివాసం ఉంటున్న వారిని జి.ఓ. నం.76 ద్వారా క్రమబద్దీకరణ చేసి యజమానులుగా గుర్తించామన్నారు. ఏండ్లుగా నివాసం ఉంటున్న వారు, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు ఈ జీవో కింద క్రమబద్దీకరిస్తున్నట్లు వెల్లడించారు. రామకృష్ణాపూర్ ప్రాంతంలో మొదటి విడతలో 1 వేయి 32 పట్టాలు, రెండవ విడతలో 367 పట్టాలు, మూడవ విడతలో 356 మందికి పట్టాలు, నాలుగవ విడతలో 282 మందికి పట్టాలు పంపిణీ చేశామన్నారు. 5వ విడతలో 242 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రిజెక్ట్ అయిన వారు, నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు చెప్పారు.
కుటుంబ రక్షణ, సంక్షేమానికి అహర్నిశలు పాటు పడే మహిళల పేరిట పట్టాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు కూరగాయలు, మాంసపు ఉత్పత్తులు ఇతరత్రా అన్ని ఒకే చోట లభించే విధంగా దాదాపు రూ. 7.20 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్నట్లు సుమన్ స్పష్టం చేశారు. పట్టణాభివృద్ధి కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. సి.సి. రోడ్లు, మురుగు కాలువలు, బి.టి. రోడ్లు, వీధి దీపాలు, అంబేద్కర్ పార్క్ ఇతర అభివృద్ధి పనులను చేపట్టినట్లు స్పష్టం చేశారు. 3, 4 వార్డులకు కలిపి కె.సి.ఆర్. మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, అంతర్గత సిమెంట్ రోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ జి.ఓ. నం.76 లో భాగంగా 5వేల 22 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆందులో 3వేల 740 అభ్యర్థులను అర్హులుగా గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.