పులిని చంపిన కేసులో ముగ్గురి అరెస్టు
Manchryala District: పులిని చంపి దానిని పాతిపెట్టిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు మంచిర్యాల జిల్లా ఫారెస్టు అధికారి వెల్లడించారు. శనివారం ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
పులికి సంబంధించిన గోర్లు, అవశేషాలు రవాణా జరుగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు ఫారెస్టు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బెల్లంపల్లి అంతటా నాఖాబందీ, సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామానికి చెందిన బాలచందర్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతన్ని తనిఖీలు చేయగా పులిగోరు లభించింది. అతనితో పాటు అంజి, లక్ష్మయ్య అనే వ్యక్తులకు సైతం ఈ ఘటనలో సంబంధం ఉండటంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు.
వీరంతా 2018 సంవత్సరంలో దుగ్నేపల్లి అటవీ ప్రాంతంలో జంతువుల కోసం విద్యుత్ వైర్లు అమర్చారు. వీటికి తగిలిన పులి అక్కడే మృత్యువాత పడింది. దీంతో వారు భయంతో పులిని చంపి బొంద పెట్టారు. వీరి దగ్గర నుండి పులి గోర్లు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి ఎఫ్ఆర్‌వో సుభాష్, కుశ్నపల్లి ఎఫ్ఆర్‌వో గోవింద్ సర్దార్, రెబ్బన ఎఫ్ఎస్‌వో రాజేష్, ఎఫ్‌బీవోలు యుగంధర్, అనిల్ తదితరులు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా దర్యాప్తు బృందం పులి కళేబరాల అవశేషాలు, గోరు గుర్తించి, స్వాధీనం చేసుకుంది. వన్యప్రాణుల నేరంపై కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు.