భట్టి సాక్షిగా… బయటపడ్డ వర్గ విభేదాలు..
-విశ్వప్రసాద్ రావ్, గణేష్ రాథోడ్ మధ్య గొడవ
-పోటాపోటీ నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్తత
-వేదికపై అసహనం వ్యక్తం చేసిన ప్రేంసాగర్ రావు
Congress : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న భట్టి పాదయాత్రలో మరోమారు వర్గవిభేదాలు బయటపడ్డాయి. మొదటి నుంచి ఆయన పాదయాత్ర అసంతృప్తి నేతలు, విబేధాల మధ్య సాగుతోంది. భట్టి పాదయాత్రకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి దూరంగా ఉన్నారు. స్వయంగా విక్రమార్క వెళ్లి మరీ బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయనకు ప్రత్యర్థి శిబిరాన్ని నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు అంతా తానై నడిపిస్తున్నారు.
కొద్ది రోజులుగా సవ్యంగా సాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రలో తాజాగా వర్గవిభేదాలు బయటపడ్డాయి. ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రంలో శనివారం ఆసిఫాబాద్ పట్టణంలో యాత్ర కొనసాగించారు భట్టి. అయితే డీసీసీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, పీసీసీ సభ్యులు గణేష్ రాథోడ్ వర్గం మధ్య గొడవ జరిగింది. సభ ఏర్పాటు విషయంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఈ రెండు గ్రూపుల మధ్య ఎప్పటి నుంచో వర్గవిభేదాలు కొనసాగుతున్నాయి. అవి కాస్తా శనివారం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రలో బయటపడ్డాయి. వేదిక సాక్షిగా రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో నేతలంతా అవాక్కయ్యారు. పోటీపోటీ నినాదాలు చేసుకోవడంతో మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు సభ వేదిక పైన అసహనం వ్యక్తం చేశారు. చివరకు ఏం చేయాలో పాలుపోక ఆయన స్టేజీ దిగి వెళ్లిపోయారు.