వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వం
-పేదోడికి ఇల్లు కట్టుకునేందుకు. రూ. 5 లక్షలు ఇస్తాం
-ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ
-అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రైతు రుణాలు మాఫీ
-రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం
-సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
CLP leader Mallu Bhatti Vikramarka: వచ్చేది ఇందిరమ్మ రాజ్యం.. ప్రజా ప్రభుత్వమని, అప్పుడు పేద ప్రజలందరికీ మేలు జరుగుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన తన పాదయాత్రలో భాగంగా 12వ రోజు కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం ఇందిరా నగర్ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేనివారికి ఇల్లు కట్టుకునేందుకు. రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. పరీక్ష పేపర్లు లీక్ కాకుండా.. అత్యంత సమర్థవంతంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రస్తుతం గ్యాస్ ధర రూ. 1300గా ఉందని.. దానిని రూ.500కే ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. భూములు లేని నిరుపేదలకు భూములు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌లా కాకుండా.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణాలు మాఫీ చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ 9 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ రూ. 18 లక్షల కోట్లు, తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రూ.5 లక్షల కోట్ల సొమ్ము సర్వనాశనం చేశాడని విమర్శించారు.
కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా చెబుతున్నా.. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక సమస్యలన్నీ తీరుస్తామని మరోమారు భట్టి విక్రమార్క వెల్లడించారు.