నోటీసుల కాలం..
-ఆరోపణల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, బండికి లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
-ఇంద్రకరణ్ రెడ్డిపై వ్యాఖ్యల నేపథ్యంలో ఏలేటీకి నోటీసులు
Telangana : ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఇవి ప్రతి సారీ కామనే. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్లాన్ మార్చి ముందుకు వెళ్తోంది. కొత్తగా తమపై ఆరోపణలు చేస్తున్న నేతలకు నోటీసులు ఇచ్చే పనిలో పడింది. చాలా చోట్ల ఇదే వ్యవహారం కొనసాగుతోంది.
తెలంగాణలో టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం పెద్దఎత్తున దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందంటూ ఇద్దరు నేతలు పలు సందర్భాల్లో ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనపై రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.
టీఎస్ పీఎస్సీ వ్యవహారంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగుతూ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేస్తున్నందుకు వారికి లీగల్ నోటీసులు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న విషయం కూడా అవగాహన లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇక తాజాగా రెండు రోజుల కిందట ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డికి సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీలోని 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. మార్చి 21న చేసిన ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారకొండ రాము ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో నోటీసు అందజేయడానికి పోలీసులు వెళ్లడంతో ఆయన అందుబాటులో లేరు. దీంతో నోటీసును ఇంటి గోడకు అంటించారు.