ఎమ్మెల్యే పైన కుట్ర ఇది
-రైతులను మోసం చేశారనే ఆరిజన్ మీద కేసు
-వారికి న్యాయం చేసేందుకే ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడారు
-ఎన్నికల సమయం కావడంతో బుదర చల్లే ప్రయత్నం
-దీని వెనక ఎవరున్నారో బయటకు తీస్తాం
-విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి బీఆర్ఎస్ నేతలు
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇదంతా ఆయన మీద జరుగుతున్న కుట్రనేనని బెల్లంపల్లి బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ జక్కుల శ్వేత, పలువురు నేతలు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరిజన్ డైరీ డైరెక్టర్లు ఆదినారాయణ, శైలజ మీద తెలంగాణ, ఆంధ్రలో కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వారు ఎక్కడికక్కడ రైతుల వద్ద డబ్బులు తీసుకోవడం వారిని మోసం చేయడం సాధారణమేనన్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు 22 కేసులు నమోదు చేశారని స్పష్టం చేశారు.
బెల్లంపల్లిలో కూడా ఆరిజన్ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను సంప్రదించినప్పుడు రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన సంస్థ పెట్టేందుకు అంగీకారం తెలిపారని అన్నారు. రైతుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఆరిజన్ సంస్థ ప్రతినిధులు బిచాణా ఎత్తేశారని వెల్లడించారు. దీంతో రైతులు పోలీసులను ఆశ్రయించారని, ఎమ్మెల్యేకు సైతం చెప్పారని తెలిపారు. రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆరిజన్ ప్రతినిధులతో మాట్లాడారని చైర్పర్సన్ శ్వేత అన్నారు.
మంచిర్యాలలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే మొదటి సీటు బెల్లంపల్లినే అని వెల్లడించారు. పేదవాళ్లు ఎవరు వెళ్లినా పనిచేసే చిన్నయ్య రెండుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, మూడోసారి సైతం ఆయన గెలుపు ఖాయమన్నారు. అందుకే ఆయనపై కుట్ర పన్నిన ప్రతిపక్షాలు, మరికొందరు కలిసి ఈ డ్రామా ఆడుతున్నారని స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో వారు ఎవరో బయటకు తీసుకువస్తామని జక్కుల శ్వేత స్పష్టం చేశారు.
విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ జక్కుల శ్వేతతో పాటు వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సదానందం, టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సభ్యుడు గెల్లి రాజలింగు, సోమగూడెం సర్పంచ్ ప్రమీలగౌడ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.